Negligence in Solid Waste Management: ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ అన్ని పట్టణాల్లోనూ ఘన వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాలు నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్ధంగా చేపట్టాలి. డంపింగ్ యార్డుల పరంగా ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలి. శాస్త్రీయ విధానంలో డంపింగ్ యార్డుకు సమస్యకు పరిష్కారం చూపాలని.. 2022 అక్టోబరు 7న జరిగిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు.
సీఎం జగన్ చెప్పే మాటలు గొప్పగా ఉన్నా.. చేతల్లో అది కనిపించడం లేదు. పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ మాట దేవుడెరుగు.. గత ప్రభుత్వంలో అద్భుతాలు సృష్టించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, ఎరువుల తయారీ కేంద్రాలను మూలన పెట్టించారు. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ విధానాలకు చిరునామాగా నిలిచిన రాష్ట్రంలో.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన యంత్రాలు తుప్పు పడుతున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం అంటే ఇదేనా జగన్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెనాలి, నరసరావుపేట, బొబ్బిలి, సాలూరు వంటి చిన్న పురపాలిక సంఘాల సైతం ఒకప్పుడు ఘన వ్యర్థాల నిర్వహణలో అద్భుతమైన ఫలితాల సాధించాయి. తెనాలిలో ప్రయోగాత్మకంగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి వీధి లైట్ల నిర్వహణకు అందించారు. బొబ్బిలి, సాలూరు వంటి పురపాలిక సంఘాలు ఎరువుల తయారీలో జాతీయ స్థాయిలో పేరొందాయి. కాకినాడతో పాటు విజయవాడ నగరపాలక సంస్థలోనూ చెత్త సేకరణకు ఆధునిక సాంకేతికతను వినియోగించి.. ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
చెత్త నుంచి ఎరువుల తయారీలో సాలూరు మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సుందరంగా తీర్చిదిద్దిన డంపింగ్ యార్డులో అప్పటి మున్సిపల్ కమిషనర్ ఏకంగా తన ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకలు నిర్వహించారు. లిమ్కా బుక్ రికార్డుల్లోనూ ఇవి నమోదయ్యాయి. ఇక్కడ ఎరువుల తయారీ విధానాన్ని ఇతర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లేవారు. కాకినాడ నగరపాలక సంస్థ ఇళ్ల నుంచి చెత్తను సేకరించడంలో ఆధునిక సాంకేతికత వినియోగానికి పేరొందింది.
ఇళ్లకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు, చెత్త సేకరణ కార్మికులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంతో పర్యవేక్షణ వంటి విధానాలతో ఎంతో ఆదర్శప్రాయంగా ఉందని నీతి అయోగ్ సైతం కితాబు ఇచ్చింది. కానీ ఇదంతా గతం. ఘన వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్లోని పలు పుర, నగరపాలక సంస్థలు జాతీయ స్థాయిలో సాధించిన గుర్తింపు ఇప్పుడు చరిత్ర పుటల్లో చేరింది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్త నుంచీ సంపదను సృష్టించి అవార్డులు, రివార్డులు సాధించినా అవి ఇప్పుడు జ్ఞాపకాలుగా మారిపోయాయి.
రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అద్భుతంగా అమలైన ఈ విధానాలేవీ కానరావడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో విజయవంతమైన ఇలాంటి ఉపయోగకర విధానాలనూ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. ఫలితంగా ఘన వ్యర్థాల నిర్వహణలో గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పట్టణాలు, నగరాల్లోనే ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా చెత్త పరిణమించింది.
గత నాలుగేళ్లలో ఎరువుల తయారీ కేంద్రాలు మూత పడ్డాయి. ఇందుకు ఉపయోగించిన యంత్రాలూ తుప్పు పడుతున్నాయి. ఉద్యానవనాలుగా మారిన డంపింగ్ యార్డులలో ప్రస్తుతం చెత్త గుట్టలు పేరుకుపోయి.. దుర్వాసనతో దోమలు, ఈగలకు నిలయాలుగా మారిపోతున్నాయి. గత ప్రభుత్వంలో కొన్ని నగరపాలికల్లో చెత్త సేకరణ రుసుము తప్పనిసరి చేయలేదు. ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలే నిధులు సమకూర్చి ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉత్తమ విధానాలు కనుమరుగై.. చెత్త సేకరణకు ముక్కుపిండి అధిక రుసుములు వసూలు చేయడమే పరమావధిగా మారింది. డబ్బులు చెల్లించని వారి దుకాణాల ఎదుట అధికారులే వ్యర్థాలను వేయిస్తున్నారు. ప్రస్తుతం 40 పుర, నగరపాలక సంస్థల్లో వినియోగ రుసుములు వసూలు చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకూ విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.