BURDEN ON PARENTS : ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులపై సర్కార్ స్మార్ట్‌ఫోన్‌ల భారం మోపుతోంది. బైజూస్ కంటెంట్ యాప్‌ను సొంత ఫోన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం.. ఎనిమిదో తరగతి వారికి ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామని ప్రకటించింది. ఎనిమిదో తరగతి మినహా మిగతా 5 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రం వారి సొంత ఫోన్లలోనే బైజూస్ కంటెంట్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్లను తీసుకుని పాఠశాలకు రప్పించి యాప్‌ను వారి ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని పేర్కొంది.
కొందరు విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు లేవు. సాధారణ ఫోన్లే ఉన్నాయి. ఇలాంటి వారి పరిస్థితి ఏంటని కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీరి సంఖ్య 10 నుంచి 15 శాతం ఉంటుందని చెబుతున్నారు. కరోనా సమయంలోనూ స్మార్ట్‌ఫోన్‌లు లేని కారణంగా చాలామంది పిల్లలు ఆన్‌లైన్ అభ్యసనను కోల్పోయారు. ఇది అనేక సర్వేల్లోనూ వెల్లడైంది. ఇప్పుడు బైజూస్ యాప్ కోసం సొంత ఫోన్లు తెచ్చుకోవాలని సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు లేని పిల్లలు వెంటనే కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటున్నారు. ఫోన్లు లేవని పాఠశాల విద్యాశాఖకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే అధికారుల నుంచి ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది.తేదీలు నిర్దేశించి ఆ ప్రకారం అత్యవసరంగా అమలు చేయాలని సూచించింది. బైజూస్ కంటెంట్ యాప్ కోసం ఇంటర్‌నెట్ సదుపాయం అవసరం అవుతుంది. వీడియోతో కూడిన పాఠాలు చెప్పేందుకు ఎక్కువ డేటా ఖర్చవుతోంది. ఇది పేద విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారంగా మారుతుంది. ఫోన్లు లేని వారు ఇప్పుడు కొత్తవి కొనాలంటే తక్కువలో తక్కువ 6 నుంచి 8వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు అందరూ పేదవారే. అలాంటి వారిపై అదనపు భారం మోపడంపై విమర్శలు వస్తున్నాయి. ఎనిమిదో తరగతి వారికిచ్చినట్లే ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఫోన్లు అందిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: