SENIOR NTR CENTENARY CELEBRATIONS : ప్రజలకు సేవ చేసేందుకు సినీ రంగాన్ని వదిలి రాజకీయంలోకి అడుగు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.. దేశ రాజకీయాల స్వరూపన్నే మార్చివేశారని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సినీ రంగంలో ఉన్న సమయంలో ఆయన నటించిన సినిమాలలో చిరస్మరణియమైన ప్రాతలను పోషించారని గుర్తు చేశారు. తెలుగు వారి ఆరాధ్య నటుడిగా ఎన్టీఆర్ నీరాజనాలందుకున్నారని అన్నారు. తెలుగు ప్రజలంటే దేశంలో తెలియని సమయంలో.. తెలుగువారికి గుర్తింపునిచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని శ్రావణ్ కుమార్ అన్నారు.
పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ అన్నారు. శత జయంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. రాష్ట్ర అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకోసం, పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రారంభించిన నాయకుడని కొనియాడారు.
సంవత్సర కాలంపాటు ఎన్టీఆర్ సినిమాల ఉచిత ప్రదర్శన : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ జిల్లాలోని తెనాలిలో ఆయన నటించిన చిత్రాలు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. సంవత్సర కాలంపాటు ప్రదర్శించే సినిమాలకు పెమ్మసాని థియేటర్ వేదికగా మారింది. గతంలో ఈ థియేటర్ ఎన్టీఆర్ యాజామాన్యంలో కొనసాగింది. వెండితెర మహానటుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిన నటుడు నందమూరి తారక రామారావు. సినీ నటుడిగానే కాకుండా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, సినిమా రంగంలో తనదైన ముద్రను వేశారు. ప్రస్తుతం ప్రదర్శిస్తున్న సినిమాలను ప్రజలు పెమ్మసాని థియేటర్‌కు వస్తున్నారంటే.. ఆయనపై ప్రజలలో అభిమానం తగ్గలేదనే చెప్పుకోవచ్చు.
ఆనాటి కాలంలో ప్రదర్శించిన సినిమాలను.. నేటి సాంకేతికతకు తగినట్లుగా డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి ప్రదర్శిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర మహాత్యం సినిమాతో ఉచిత ప్రదర్శనను మొదలు పెట్టారు. శత జయంతి ఉత్సవాలు పూర్తయ్యే సమయానికి 250కి పైగా సినిమాలు ప్రదర్శంచనున్నట్లు.. ప్రస్తుత థియేటర్ యాజమాన్యం చెబుతోంది. ఇలా ఒకే నటుడి సినిమాలను ఏడాది పాటు ఉచితంగా ప్రదర్శించటం ఓ రికార్డు అని నిర్వాహకులు చెబుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు ఉదయం మొదటి ఆటగా ఎన్టీఆర్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు.
ఇవీ చదవండి :