SELFIE WITH LOKESH PROGRAM : రాష్ట్రంలోని యువత.. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. అయితే యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు తాను బస చేసే క్యాంప్ సైట్‌కి వచ్చిన వారందరితోనూ లోకేశ్ ప్రతి రోజూ ఫోటోలు దిగుతున్నారు. అయితే సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం చేపట్టే ముందు 200 మంది వరకూ వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేసాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇప్పుడు ఏకంగా 3వేల మంది లోకేశ్‌తో ఫొటోలు తీసుకుంటున్నారు.
పాదయాత్ర ప్రారంభమైన తొలి 15 రోజుల్లోనే రోజుకు వెయ్యి మంది వరకూ వచ్చి ఫొటోలు దిగేవారని, ఆ తర్వాత సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల 3పట్టభద్రుల శాసనమండలి ఫలితాలు వచ్చాక ఈ క్రేజ్ మరింత పెరిగిందని.. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో లోకేశ్ పాదయాత్ర విద్యావంతుల్లో ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఎన్నికల వరకూ తూర్పు రాయలసీమ ప్రాంతంలో సాగిన లోకేశ్ యువగళం పాదయాత్ర, తుది ఫలితం వచ్చే సమయానికి పశ్చిమ రాయలసీమలోకి ప్రవేశించింది.
ప్రతీ సమయంలోనూ ఎమ్మెల్సీ అభ్యర్థులను విద్యావంతులు గెలిపించుకోవాలంటూ లోకేశ్ చెప్తూనే వచ్చారు. 3పట్టభద్రుల స్థానాలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకోవటంతో క్యాడర్లోనూ జోష్ పెరిగింది. రోజూ ఉదయం 7గంటలకే లోకేశ్ బస చేసే క్యాంప్ సైట్‌కు చేరుకుని ఆయనతో స్వయంగా ఫొటో దిగేందుకు బారులు తీరి వేచి ఉంటున్నారు. పాదయాత్ర ప్రారంభించాక లోకేశ్‌ను కలిసి ఫొటో దిగేవారి సంఖ్య దీనికి అదనం. ఇలా మొత్తంగా చూస్తే ప్రతీ రోజూ 6వేల మంది వరకూ ప్రత్యక్షంగా లోకేశ్‌ని కలుస్తున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావటంతో తన పాదయాత్రను ఉదయం ఏడు గంటలకే ప్రారంభించాలని లోకేశ్ భావిస్తున్నా.. సెల్ఫీ కోసం ఆ సమయానికి వందల మంది బారులు తీరి ఉంటున్నారు.
వచ్చిన వారెవ్వరినీ నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో అందరితోనూ ఓపిగ్గా సెల్ఫీలు దిగిన తర్వాతే పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దీంతో పాదయాత్ర ప్రారంభించే సమయం ఒక్కోసారి దాదాపు 2గంటల వరకూ ఆలస్యమవుతోంది. అయితే లోకేశ్‌తో ఫొటో దిగిన ప్రతి ఒక్కరూ తమ ఫొటోను ఫేస్బుక్, వాట్సప్ గ్రూపుల్లోనూ, స్టేటస్‌గానూ, టెలిగ్రామ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అభిమానులు పోస్టు చేసిన ఫొటోలు వీక్షించే వారి సంఖ్య ప్రతి రోజూ 5లక్షలు దాటుతోందని పార్టీ వర్గాలు అంచనా భావిస్తున్నాయి. సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో భాగంగా ఫొటోలు దిగేవారిలో యువత అధిక సంఖ్యలో ఉంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జుల ద్వారా వచ్చే గ్రామ పెద్దలు, మండలస్థాయి నాయకులు, వారి కుటుంబ సభ్యులతో క్యాంప్ సైట్ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రద్దీ కారణంగా ఏ గ్రామస్థాయి నాయకుడికో ఫొటో దిగటం కుదరకపోతే.. వారిని బుజ్జగించి మరుసటి రోజు మొదటి వరుసలో లోకేశ్‌తో పరిచయం చేయటం ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జులకు దినచర్యగా మారింది.
లోకేశ్‌ను రహస్యంగా కలుస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు: పాదయాత్ర ప్రారంభానికి ముందు లేక పాదయాత్ర ముగిశాక వివిధ ప్రభుత్వ శాఖల చిరుద్యోగులు లోకేశ్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. బహిరంగంగా కలిస్తే తమకు వేధింపులు ఎక్కువై ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వారెవ్వరూ బయటపడట్లేదు. పోలీసు కానిస్టేబుళ్ల నుంచి వివిధ శాఖల్లో పనిచేస్తూ సమస్యలు ఎదుర్కొనే ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలా వివిధ రంగాల వారు లోకేశ్‌ను రహస్యంగా కలిసి తమ సమస్యలపై వినతులు ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాటిని తప్పక పరీష్కరిస్తుందనే హామీ వారు పొందుతున్నారు. లోకేశ్ పాదయాత్ర చేసే ప్రాంతంలో అక్కడ చిరు వ్యాపారులకూ ఊతమిస్తోంది. పాదయాత్రకు వచ్చే జనం రద్దీతో తోపుడు బళ్లు, లేదా గంప చేతపట్టుకుని వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వారికీ గిరాకీ పెరిగి ఆయా వర్గాల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: