గుంటూరు జిల్లా రేపల్లె మండలం చాట్రగడ్డ గ్రామంలోని వేదాంత నిష్టాశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన ఆకృతులు తయారుచేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. బడి అంటే నాలుగు గోడల మధ్య పాఠాలు వల్లించడం కాదు.. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా విజ్ఞానాన్ని పెంపొందించడమని ఈ పాఠశాల చాటి చెబుతుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పాఠశాల యాజమాన్యం వ్యర్థ పదార్థాలతో అందమైన కళాకృతులు తయారచేసేలా శిక్షణ ఇస్తోంది.
వ్యర్థాలతో అందమైన ఆకృతులు
నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో వాటిని పనికిరావన్న భావనతో పడేస్తాం. కానీ కళా హృదయంతో చూస్తే వాటికి అందమైన రూపాన్ని ఇవ్వొచ్చని రుజువు చేస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. ప్లాస్టిక్ డబ్బాలతో పూల కుండీలు, పాలిథిన్ కవర్లతో రంగు రంగుల పువ్వులను తయారు చేస్తున్నారు.
పర్యావరణంపై అవగాహన..
విద్యార్థులు ఖాళీ సమయాల్లోనూ, సెలవు రోజుల్లో తమ పరిసర ప్రాంత ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వాటి నిర్మూలనకు కృషి చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యం పెరగకుండా తమ వంతుగా కృషి చేస్తున్నామంటూనే.. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: