ఓట్ల లెక్కింపుతో ఆధిక్యం పలుమార్లు చేతులు మారడంపై అభ్యర్థి, మద్దతుదారులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి పంచాయతీ విషయంలో ఈ ఆందోళన జరిగింది. మొదట చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఒక్క ఓటు ఆధిక్యంతో గోవిందమ్మ గెలిచినట్లు ప్రకటించారు. ప్రత్యర్థి కొమ్మనబోయిన ఇందిర.. రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టడంతో వీఆర్వో ఆదేశాలలో సిబ్బంది రెండోసారి ఓట్లు లెక్కించారు. ఈసారి గోవిందమ్మకు 24 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇరు వర్గాలు పరస్పరం వాదులాడుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడోసారి నిర్వహించిన ఓట్ల లెక్కింపులో గోవిందమ్మకు మళ్లీ 24 ఓట్ల ఆధిక్యత లభించింది. ఎంపీడీవో రాధాకృష్ణ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఆర్వోతో మాట్లాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నాలుగోసారి చేపట్టిన లెక్కింపులో గోవిందమ్మ 30 ఓట్ల ఆధిక్యం సాధించడంతో ఆమె గెలుపును ప్రకటించారు.
న్యాయం చేయాలని..
సర్పంచ్‌గా పోటీ చేసిన కొమ్మనబోయిన ఇందిర... ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ.. వెదుళ్ళపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకొని ధర్నాను అడ్డుకున్నారు. ఇందిర మద్దతుదారులు వెదుళ్లపల్లి నుంచి బాపట్ల ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకొని ఎంపీడీవో రాధాకృష్ణను కలిసి తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. పోలింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: