సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో-19 అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీల్లో వాదనలు ముగిశాయి.
దీంతో తీర్పును వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అంతకు ముందు సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(SMPCL) డైరెక్టర్ ధర్మారావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. డెయిరీ నిర్వహణ బాధ్యతను పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం 2021లో జీవో ఇచ్చిందన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ హోదా పొందాక.. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులు కంపెనీలో లేవన్నారు. ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చారనే ఆరోపణ లేవనెత్తుతోందన్నారు. జీవో జారీ వెనుక ప్రభుత్వ ప్రయోజనాలున్నాయా.. ? పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలున్నాయా..? అనే విషయాన్ని వెల్లడించడం లేదన్నారు. రాజకీయ కారణాలతో సంగం డెయిరీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారని కోర్టుకు తెలిపారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని విన్నవించారు.
ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనల వినిపిస్తూ.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా జీవో జారీచేశామన్నారు. ఆ జీవోతో డెయిరీ కార్యకలాపాలకు ఎలాంటి అవరోధం లేదన్నారు. జీవో అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయంగా లేవన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చేసి జీవో అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ సంఘం - జీడీఎంపీఎస్ 'ముందు అప్పీల్ వేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు. తాము వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారన్నారు. ప్రభుత్వ జీవోను సవాలు చేసే అర్హత ఎస్ఎంపీసీఎల్(SMPCL) డైరెక్టర్ కు లేదన్నారు. తమ ఫిర్యాదు ఆధారంగా సంగం డెయిరీలో అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇదీ చదవండి:
JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్ లేఖలు