రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 60 వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాల్లో జమ అయ్యాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సమయస్పూర్తి, పట్టుదలతో పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచారని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన సజ్జల... గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల గడప వద్దకే పాలన వెళ్లిందని వివరించారు.
ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని సజ్జల పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 80 శాతం మందికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి కలిగిందని తెలిపారు. ఇవాళే పేదలకు ఉచిత ఇళ్లపట్టాల పంపిణీ చేయాల్సి ఉన్నా... కోర్టుల్లో తెదేపా వివిధ కేసులు వేసి అడ్డుకుంటున్న కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని సజ్జల వ్యాఖ్యానించారు. అంతకుముందు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండీ... త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్