అడుగు తీసి అడుగెయ్యాలంటే భయం అక్కడ. ఎందుకంటే ఎక్కడ గుంతలో కాలు పెట్టాల్సి వస్తుందోనని! గుంటూరు నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కొన్ని ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఇది. పాడైపోయిన రహదారుల్ని తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేసి సరిపెట్టేస్తుండటంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
గుంటూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రహదారుల దుస్థితికి అద్దం పట్టే దృశ్యాలివి. మోకాలి లోతు గుంతలు, కంకర తేలిన రోడ్లతో వాహనదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల వరకూ ఫర్వాలేదు గాని.. కాలనీలకు వెళ్లే రోడ్లు చాలావరకూ దయనీయంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మరీ దారుణంగా తయారయ్యాయి. గుంతలు పడిన ప్రతిసారి వాటిలో మట్టిపోసి సరిపెట్టడం మినహా...శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించటం లేదు. దీంతో ఏళ్ల తరబడి ఈ రహదారులు ఇలాగే ఉండిపోతున్నాయి. ముఖ్యంగా పలకలూరు రోడ్డు, ఎన్జీవో కాలనీ, హౌసింగ్ బోర్డు, శ్యామలానగర్, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో రహదారులు గోతులు పడ్డాయి. వర్షం కురిస్తే వాటిల్లోకి నీరు చేరుతుంది. రోడ్డు కనిపించదు. దీంతో వాహనదారులు తరచుగా కిందపడిపోతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడిన సందర్భాలున్నాయి.
కొత్త పాలకవర్గం చేసేందేమి లేదు!
గుంటూరు నగరపాలక సంస్థకు కొత్త పాలకవర్గం వచ్చి నెలలు గడుస్తున్నా..రహదారుల గురించి పట్టించుకోవడం లేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మా బాధలు పట్టించుకోరా..!
నగరాలు, పట్టణాల్లో ఇటీవల ఆస్తి పన్నులు పెంచటంతో పాటు చెత్తపన్ను, డ్రైనేజి పన్ను అంటూ కొత్త పన్నులు విధిస్తున్నారు. కానీ ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించటంపై మాత్రం పాలకవర్గం, అధికారులు దృష్టి సారించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి.
త్వరలో ఇంటింటి సర్వే...అక్షరాస్యత, విద్య పరిస్థితులు తెలుసుకునేందుకే!