GUNTUR CITY ROADS DAMAGE : గుంటూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. మోకాలిలోతు గుంతలు, కంకర తేలిన రోడ్లతో వాహనదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల వరకూ ఫర్వాలేదు కానీ కాలనీలకు వెళ్లే రోడ్లు చాలా వరకూ అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గుంతలు పడిన ప్రతిసారి వాటిలో కంకర, మట్టిపోసి సరిపెట్టడం మినహా శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించటం లేదు. ఏళ్ల తరబడి ఈ రహదారులు ఇలాగే ఉండిపోతున్నాయి. అకాల వర్షాలు మరోసారి గుంటూరు నగర రోడ్ల దుస్థితిని కళ్లకుకట్టాయి.
ప్రభుత్వం దృష్టికి వెళ్లినా లాభం లేదు: ముఖ్యంగా పలకలూరు రోడ్డు, ఎన్జీవో కాలనీ, హౌసింగ్ బోర్డు, శ్యామలానగర్, ఏటీ అగ్రహారం, జన్మభూమి కాలనీ, స్వర్ణభారతి నగర్, రత్నగిరి కాలనీ ప్రాంతాల్లో రహదారులపై గుంతలు పడ్డాయి. వర్షం కురిస్తే వాటిల్లోకి నీరు చేరుతుంది. ప్రధానంగా పలకలూరులో రోడ్ల దుస్థితి గురించి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లినా ఎలాంటి లాభం లేదు. గుంతల్లో కంకర పోయడం తప్ప పక్కాగా రహదారి నిర్మాణాన్ని చేపట్టలేదు. ఫలితంగా వాహనదారులు తరచుగా కిందపడిపోతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారు.
"గుంటూరులో ఎటు వెళ్లిన గుంతలు కామన్‌గా ఉన్నాయి. గుంతలు ఉండటం వల్ల వాహనాలు సగానికి పైగా మునిగి పోతుంది. వాటిని చూసుకొని మనమే జాగ్రత్తగా వెళ్లాలి."-కోటేశ్వరరావు, గుంటూరు
మరమ్మతులకు గురవుతున్న వాహనాలు : గతుకుల రహదార్లపై వెళ్లే వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్నిసార్లు గుంతల్లో వాహనాలు ఇరుక్కున్న పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతోంది. ఈ ఇబ్బందులు ఎప్పటికి తీరతాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
"స్కూల్ పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. రోజు రావాలన్నా, పోవాలన్నా నరకంగా ఉంది. నడుములు నొప్పులు వస్తున్నాయి. రోడ్లు బాగుచేయడం లేదు. రోడ్ల మధ్యలో గుంతులు ఏర్పడ్డాయి. గుంతల్లో నీళ్లు చేరడం వలన రహదారి కనిపించండం లేదు. వాహనాలు కింద పడిపోతున్నాయి. ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ రోడ్లను ఎంత తొందరగా బాగు చేస్తే అంత మంచింది."- ఏసయ్య, ఆటో డ్రైవర్
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి : గుంటూరు శివారు ప్రాంతాల్లో రహదార్ల దుస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని వర్షాకాలం నాటికైనా పరిస్థితి చక్కబడేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు .
"ఇటువంటి భయంకరమైనా రోడ్లు ఇంతవరకూ ఎక్కడ చూడలేదు. ఎంతసేపు బటన్ నొక్కడం తప్ప రోడ్ల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. సంక్షేమము ముఖ్యమే ఇది కూడా చూసుకోవాలి కదా. సిటీలో అన్ని రోడ్లు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకూ రోడ్లు మొత్తం ఇలాగే ఉన్నాయి. వాహనాలన్ని పాడై పోతున్నాయి."- వెంకటరావు, గుంటూరు
ఇవీ చదవండి