చిలకలూరిపేట మండలం పసుమర్రు నుంచి చీరాల
వెళ్లే మార్గంలో చేస్తున్న పనులు
ఓడరేవు-నరసరావుపేట- పిడుగురాళ్ల జాతీయ రహదారి బలోపేతానికి రూ.44 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు లేఖ ద్వారా తెలిపారు. వార్షిక ప్రణాళిక 2019-20లో ఈపీసీ కింద రహదారి అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో ఈ మార్గానికి ప్రాధాన్యం ఉన్న దృష్ట్యా ఈ రహదారికి నిధులు విడుదల చేయాలని కోరుతూ గతంలో ఎంపీ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్న మార్గమని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణ సామాగ్రి, ఉత్పత్తులు, వ్యవసాయం, ప్రజా రవాణా ఈమార్గంలో అధికంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాధాన్యం గల ఈ మార్గం గుంతలమయంగా మారి ప్రయాణం ప్రజలకు నరకయాతనగా మారిందని వివరించారు. దీంతో ప్రయాణ సమయం పెరగడంతోపాటు వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రమై ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.
*జాతీయ రహదారిగా ఉన్న ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడానికి వీలులేని నేపథ్యంలో కేంద్రం చొరవ చూపాలని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ.44 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఎంపీకి లేఖ ద్వారా వివరించారు.
చురుగ్గా రహదారి పనులు
చీరాల నుంచి చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా రావిపాడు సమీపంలోని పెట్రోలు బంక్ సమీపంలో ఉన్న రహదారి వరకు 60.69 కి.మీ. మేర పూర్తిస్థాయిలో పటిష్ఠపరచనున్నట్లు అధికారులు తెలిపారు. రహదారికి రెండు వైపులా బరమ్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట మండలం పసుమర్రు నుంచి చీరాల వరకు రహదారిని పటిష్ఠం చేసే పనులు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆరు నెలల్లో మొత్తం 60.69 కి.మీ. మేర రహదారి పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు.
పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా
చిలకలూరిపేట- నరసరావుపేట పట్టణాల మధ్య రాకపోకలు మరింతగా పెరిగిన నేపథ్యంలో ముందుగా 18 కి.మీ. దూరాన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించాలని డీపీఆర్ నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపించాం. త్వరలో ఆ నిధులు కూడా మంజూరైతే ప్రజలకు మరింత సులభంగా ఉంటుంది. ఓడరేవు- నరసరావుపేట- పిడుగురాళ్ల రహదారిని పూర్తిస్థాయిలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారిగా తీర్చిదిద్దుతాం. - లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎంపీ, నరసరావుపేట
ఇదీచదవండి