గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని బాలాజీరావుపేటకు చెందిన జయలక్ష్మి.. కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతోంది. అయినా తనను పట్టించుకున్న నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
జయలక్ష్మికి కుమారులు లేరు. ఉన్న ఒక్క కూతురు వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లిపోయింది. భర్తకు మూడేళ్ల కిందట పక్షవాతం వచ్చి మంచానపడ్డారు. జయలక్ష్మి తన ఇంటిముందు కూర్చున్న సమయంలో ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టారు. కాలుకు గాయం చేశారు. నరాలు తెగి సర్జరీ చేయించుకుని అప్పులపాలయ్యారు జయలక్ష్మి. ఉపాధి పోయి ఆదాయం లేక కుటుంబం గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం సంక్షేమ ఫలాలూ అందని పరిస్థితి.
కుల ధ్రువీకరణ పత్రం ఉంటే... కనీసం పెన్షన్ అయినా వస్తుందని కొంతమంది సలహా ఇవ్వగా... మూడేళ్ల నుంచి జయలక్ష్మి ప్రయత్నిస్తోంది. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. గ్రామ సచివాలయంలో పట్టించుకోవడంలేదని వాపోయింది. గట్టిగా ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని... మున్సిపల్ కార్యాలయానికి వెళ్లమని చెప్పారు. అక్కడ కమిషనర్ని అడిగితే ఎమ్మార్వోని కలవమని సూచించారు.
వారం రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఆయన అందుబాటులో లేక నిరీక్షణ తప్పట్లేదు. అసలే డబ్బులు లేని పరిస్థితుల్లో ఆటో ఖర్చులూ భారంగా మారుతున్నాయని జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చి.. తమ భర్తకు పెన్షన్ ఇప్పించలాని జయలక్ష్మి కోరుతున్నారు.
ఒంటరి మహిళగా నిరూపించుకుంటేనే పెన్షన్..
జయలక్ష్మి బాధ ఒకలా ఉంటే... చినరావూరుతోటకు చెందిన అంజమ్మది మరో తిప్పలు. 15 ఏళ్ల కిందట భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బతికి ఉన్నాడో లేడో తెలియదు. ఒంటరి మహిళ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. మూడేళ్లుగా పెన్షన్ తీసుకుంటోంది. అయితే... వాలంటీర్లు తనను బెదిరిస్తున్నారని, ఒంటరి మహిళగా నిరూపించుకుంటేనే పెన్షన్ ఇస్తామని, లేదంటే రద్దు చేస్తామని హెచ్చరించారు. 4 రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని ఆమె వాపోయారు. తహసీల్దార్ అందుబాటులో లేక.. చినరావూరుతోట నుంచి ప్రతిరోజు వచ్చి తిరిగి వెళుతున్నట్లు చెప్పారు. రేషన్ కార్డులో భర్త పేరు ఉండడంతో సమస్య వచ్చిందని, ఆ పేరును తొలగించి తమకు పెన్షన్ కొనసాగించాలని కోరడానికి వచ్చినట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండీ... MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ