Revanth Reddy Hath se Haath Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు చేసి యాత్రకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలతో రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వన దేవతలకు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ నేతలు పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు జాకారం గట్టమ్మ గుడి, సాయిబాబా దేవాలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
అనంతరం ములుగు జిల్లా ప్రాజెక్ట్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాచరిక పాలన మీద పోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ వస్తే మార్పు వస్తుందని ఉద్యమకారులు, నిరుద్యోగులు, పాత్రికేయులు అనుకున్నారని.. ఎవరి జీవితాల్లోనూ మంచి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ఎవరు చెప్పింది వినరని.. ఆయనకు తెలియదని విమర్శించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని రేవంత్ ఆరోపించారు.
''తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం యాత్ర చేపట్టాం. రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క-సారాలమ్మ స్ఫూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టాం. సీఎం కేసీఆర్ పీడ విరగడ కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. బడ్జెట్‌పై ఎప్పుడూ కేసీఆర్ అబద్ధాలే చెబుతారు. కేసీఆర్ వచ్చాక 30 శాతం బడ్జెట్‌లో తేడా వచ్చింది. ఇచ్చేది ఏమి లేదు కాబట్టి రాసుకోరా సాంబా అంటే హరీశ్ రాసుకుని చదివిండు.''-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రంలోని పస్రా, గోవిందరావుపేట, చల్వాయి మీదుగా రేవంత్‌రెడ్డి పాలంపేట చేరుకుంటారు. పాలంపేటలో బస చేసి.. మంగళవారం ఉదయం రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మళ్లీ యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, ఇతర ముఖ్య నాయకులు రేవంత్‌రెడ్డితో పాటు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలను ప్రారంభించారు. 6 నెలల పాటు పూర్తిగా జనంలోనే ఉండాలని యోచించిన రేవంత్ రెడ్డి.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైతే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది.
ఇవీ చూడండి..