గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన సురేశ్ అనే వ్యక్తి మెకానిక్‌గా పనిచేసేవాడు. ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో అతని కాళ్లు దెబ్బతిన్నాయి. దీంతో అతను ఏ పని చేసే పరిస్థితి లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావటంతో .. అతని వైద్యానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈటీవీ కథనానికి స్పందన..
సురేశ్ దయనీయ పరిస్థితిపై ఈటీవీలో ఈనెల 28వ తేదీన కథనం ప్రసారమైంది. అది చూసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త చదలవాడ శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. ఈటీవీ ప్రతినిధులతో మాట్లాడి.. తన వంతుగా సురేశ్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. లక్ష రూపాయలు ఆర్థిక సాయం పంపించారు. గుంటూరులోని ఈటీవీ ప్రతినిధి.. సురేశ్ ఇంటికి వెళ్లి ఆ సాయాన్ని అందజేశారు. వీడియో కాల్ ద్వారా చదలవాడ శ్రీనివాసరావుతో సురేశ్ మాట్లాడారు. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఏదైనా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అలాగే అతని కుమార్తె విద్యాభ్యాసానికి కూడా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన శ్రీనివాసరావుకు సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు చెందిన బంగారు నగల వ్యాపారి బషీర్ కూడా తన వంతుగా 10వేల రూపాయలు సాయం చేశారు. సురేశ్ పరిస్థితిని తెలియజేసి... అతనికి సాయమందేలా చేసిన ఈటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: అన్నార్థుల ఆకలి కష్టాలకు 'ఫుడ్కార్డు'తో చెక్!