Re Counseling of Fake PG Medical Seats in Andhra Pradesh: నకిలీ పీజీ వైద్య సీట్లతో.. ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సిలింగ్ గందరగోళంగా మారింది. గతంలో కౌన్సెలింగ్‌ను రద్దు చేయగా.. తాజాగా నిర్వహించిన కౌన్సిలింగ్ వల్ల.. గత కౌన్సిలింగ్‌లో సీటు పొందిన సుమారు 50 మందికిపైగా విద్యార్థులకు ప్రస్తుతం మొండిచెయ్యి ఎదురైంది. అంతకుముందు ప్రాధాన్యత కలిగిన స్పెషలిస్ట్స్ లో సీట్లు వచ్చిన వారు ప్రాధాన్యత లేని విభాగాలకు తాజా కౌన్సెలింగ్‌లో రావాల్సి వస్తోందని మానసిక వేదనకు గురవుతున్నారు.
నంద్యాల శాంతిరామ్, రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాలలకు కొత్తగా మంజూరైనట్లు చూపించి కౌన్సెలింగ్‌లో పెట్టిన 113 నకిలీ సీట్లను తొలగించి వైద్య విద్య కౌన్సిలింగ్ ప్రక్రియ మళ్లీ చేపట్టారు. ఐతే.. ఇది గందరగోళంగా మారింది. గత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కించుకున్న కొందరు తాజా కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా నుంచి యాజమాన్య కోటాలోకి వచ్చారు. కన్వీనర్ కోటాలో ప్రభుత్వ కళాశాలలో సీటు వస్తే నామమాత్ర రుసుముతో చదుకోవచ్చు.
మూడేళ్ల పీజీ కోర్సుకు లక్ష రూపాయలు కూడా ఖర్చవ్వదు. ప్రస్తుతం బి కేటగిరిలో వీరికి సీట్లు రావటంతో.. ఏడాదికి 13 లక్షల రూపాయలు కట్టాలి. సీ కేటగిరీ అయితే ఏటా 59 లక్షల రూపాయల ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దాన్నే ఏడాదికి కోటి 5 లక్షలకు పైగా ప్రైవేట్ వైద్య కళాశాలలు అమ్ముకుంటున్నాయి. కౌన్సెలింగ్ మళ్లీ నిర్వహించటం వల్ల అనేక మంది విద్యార్థుల ఆనందం ఆవిరైంది. స్పెషాలిటీ సీటు వచ్చిందని అనుకునేలోగా నకిలీల దెబ్బకు అంతా తారుమారైందని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.
నాన్ సర్వీస్ విభాగంలోని 1085 సీట్లను కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ కోసం సీట్ మాట్రిక్స్లో ఉంచారు. అందులో 999 భర్తీ అయ్యాయని.. రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి తెలిపారు. ఇంకా 86 సీట్లు కన్వీనర్ కోటాలో.. ప్రాధాన్యత లేని విభాగాల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. గత నెలలో నకిలీ ఎల్ఓపీల కారణంగా సీట్ మాట్రిక్స్లో 1124 కన్వీనర్ సీట్లను ఉంచారు. 1051 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. కానీ వీటిలో 39 నకిలీ సీట్లు కావటంతో తాజాగా వాటిని తొలగించి 1085 కు కౌన్సిలింగ్ నిర్వహించారు.
కౌన్సిలింగ్‌తో 999 మందికే సీట్లు వచ్చాయి తొలగించిన సీట్లు 39 అయినప్పటికీ 52 మంది సీట్లు కోల్పోయారు. తమకు గతంలో ప్రాధాన్యత ఉన్న స్పెషాలిటీ సీట్లు వచ్చాయని.. ప్రస్తుతం ప్రాధాన్యత లేని విభాగాల్లో రావటంతో విద్యార్థులు సీట్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రాధాన్యత సీట్లు నష్టపోయామని వారు ఆవేదన చెందుతున్నారు.
ప్రైవేట్ అన్ ఎయిడెడ్, మైనార్టీ కళాశాలలోని కన్వీనర్ కోటాకు సంబంధించి తాజాగా 784 సీట్లు అందుబాటులో ఉంచగా అందులో 511 భర్తీ అయ్యాయి. 233 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నకిలీ సీట్ల దెబ్బకు రద్దు చేసిన కౌన్సిలింగ్‌లో 842 సీట్లు ఉంచగా 588 భర్తీ అయ్యాయి. కానీ వీటిలో 58 సీట్లు నకిలీవని గుర్తించి తాజా కౌన్సిలింగ్‌లో తీసేశారు. సర్వీస్ కేటగిరీలోని సీట్ల కేటాయింపును మంగళవారం ప్రకటించనున్నారు.
నకిలీ సీట్లకు సంబంధించి తప్పు ఎక్కడ జరిగిందనేది గుర్తించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నకిలీలను గుర్తించలేకపోయారంటూ యూనివర్శిటీ అకడమిక్ విభాగంలో కొందరు ఉద్యోగుల్ని బాధ్యులుగా చేసి బయట పడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై దిల్లీలోని జాతీయ వైద్య కమిషన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది.
ED Raids on Medical Colleges : పీజీ సీట్ల బ్లాకింగ్ దందాలో.. ఈడీ చేతికి కీలక ఆధారాలు