గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది ఓవైపు జిల్లాయంత్రాంగం వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గురువారం ఒక్కరోజే 18 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 195 కి పెరిగింది. కర్నూలు తర్వాత రెండో అత్యధిక కేసులున్న జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది. ఈ పరిణామం అటు సామాన్య ప్రజనీకంతో పాటు అధికారులనూ కలవరపరుస్తుంది. నాలుగు రోజుల్లో 66 కేసులు నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న వెలువడిన 18 కేసుల్లో ఒకటి నరసరావుపేట నుంచి నమోదు కాగా.. మిగతావన్నీ గుంటూరు అర్బన్ పరిధిలోనే బయటపడ్డాయి. ఇప్పటివరకు జిల్లాలో 8 మంది కరోనాతో మృతిచెందగా... 23 మంది చికిత్స అనంతరం డిశ్చార్జయ్యారు. మరో 164 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడున్న ఆర్టీపీసీఆర్ విధానంతోపాటు కొత్తగా జిల్లాకు కియా మిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గంటకు వంద కేసుల చొప్పున... రోజుకు గరిష్ఠంగా వెయ్యి పరీక్షలను ఈ విధానం ద్వారా చేపట్టే అవకాశముంది. ఈ విధానం ద్వారా ఇంకా పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.
ఎవరింట్లో వారే...
రంజాన్ మాసం సందర్భంగా అధికారులు గుంటూరు కలెక్టరేట్లో ముస్లిం మతపెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని... మసీదులో ప్రార్థనలకు ఇమామ్, మౌజన్ తో పాటు మరో ఇద్దరికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.