గుంటూరు జిల్లాలో అధిక వర్షాలతో కర్షకులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 32 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలకు నష్టం వాటిల్లింది. కృష్ణానదికి ఎగువ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో పాటు స్థానికంగా భారీ వర్షాలు నమోదు కావడంతో నదిలో వరద ఉద్ధృతి పెరిగి నదీతీరం వెంబడి సాగు చేసిన పంటలు నీటమునిగాయి. ముంపునకు గురైన పంటలు తేరుకొనేలోపు మళ్లీ వరదలు రావడంతో మొత్తం వరద పాలయ్యాయి. వరుసగా వరదలతో పంటలు తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పల్నాడు ప్రాంతంలో వాగుల వెంబడి ఉన్న పొలాలు పత్తి, మిర్చి, అపరాలు పంటలు ముంపునకు గురికావడంతో ఉరకెత్తాయి. డెల్టాలో వరి పంటలతో పాటు నదీతీరంలోని ఉద్యాన పంటలు వరుస వరదలతో దెబ్బతిన్నాయి. అటు పల్నాడు, ఇటు కృష్ణా పశ్చిమ డెల్టాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరుస వర్షాలతో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో పంటలు చేతికి వచ్చే దశలో నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాగులు, నదీతీరం వెంబడి దెబ్బతిన్న పొలాలే మళ్లీ మళ్లీ ముంపునకు గురికావడంతో పనికిరాకుండా పోయాయి. 33శాతం కంటే అధికంగా నష్టపోయిన పంటల విస్తీర్ణాన్ని వ్యవసాయ, ఉద్యాన శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు రూపొందించాయి. నష్టపోయిన రైతులకు వెంటనే పెట్టుబడి రాయితీ అందిస్తే మళ్లీ పంటలు సాగు చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని కోరుతున్నారు.
కొల్లూరు మండలం దోనేపూడి చప్టాపై ఉద్ధృతంగా ప్రవాహం
కొల్లిపరలో నేల కొరిగిన కందతోట
చెరువును తలపించేలా... ప్రత్తిపాడు మండలం వంగిపురం వద్ద పైరును ముంచేసిన వరద
రాయపూడి గ్రామంలోకి చేరిన వాగు నీరు
* అక్టోబరు నెలలో 14వ తేదీ వరకు 9 మండలాల పరిధిలో 1442.8 హెక్టార్లు నీట మునిగాయి.
* పంటలు నీటమునిగిన మండలాలు : మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, ఫిరంగిపురం, పెదకూరపాడు, సత్తెనపల్లి, మేడికొండూరు, అమరావతి
* సెప్టెంబరు 28న నదికి వచ్చిన వరదల వల్ల ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 4500 హెక్టార్లలో మిరప, పసుపు, ఉల్లి, కూరగాయలు, కంద, పూలు, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
* అక్టోబరులో గత రెండు రోజులకు నదికి వరదతో ప్రాథమిక అంచనాల ప్రకారం 904 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలు కొనసాగుతున్నాయి.
* సెప్టెంబరు నెలలో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల ముంపునకు గురై పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 11 మండలాల పరిధిలో 1486.79 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి.
* పంటలు నీటమునిగిన మండలాలు : దాచేపల్లి, అచ్చంపేట, మేడికొండూరు, అమరావతి, మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు
* జిల్లా ఏడాది సాధారణ వర్షపాతం : 853 మి.మీ. * అక్టోబరు నెల సాధారణ వర్షపాతం : 130.5 మి.మీ. * ఖరీఫ్ సీజన్ ఆరంభం జూన్ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు 62 రోజులు వర్షం పడింది.
* జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 42 మండలాల పరిధిలో సాధారణ వర్షపాతంతో పోల్చితే 20శాతంపైగా అధిక వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
* సగటు వర్షపాతం 30.7 మిల్లీమీటర్లు : జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు సగటున 30.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తెనపల్లిలో 98.4 మిల్లీమీటర్లు, మాచర్ల 91.2, గురజాల 76.4, రేపల్లె 70.2, నగరం 65.4, రెంటచింతల 62.6, మేడికొండూరు 60.2, వేమూరు 54.4, ముప్పాళ్ల 52.6, రాజుపాలెం 52.6, భట్టిప్రోలు 52.4, అచ్చంపేటలో 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యంత తక్కువగా ఈపూరు మండలంలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
* సెప్టెంబరులో భారీ వర్షాల వల్ల ఏడు మండలాల్లో వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 3394 మంది రైతులకు సంబంధించిన పొలాల్లో 1673.205 హెక్టార్లలో పంట దెబ్బతింది.
* పంటలు దెబ్బతిన్న మండలాలు : పెదకూరపాడు, అమరావతి, దాచేపల్లి, అచ్చంపేట, తుళ్లూరు, సత్తెనపల్లి, మేడికొండూరు
కొండవీటి వాగు వరద ఎత్తిపోత
కొండవీటివాగులోని వరదనీటిని సీతానగరం వద్ద ఉన్న ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలో కలుపుతున్నారు. బుధవారం మూడు మోటార్లను ఆన్‌చేసి నీటిని నదిలోకి తోడి పోస్తున్నారు. మరోవైపు నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఉండవల్లి హెడ్ రెగ్యులేటర్ గేట్ల లీకుల ద్వారా నీరు వాగులోకి ప్రవేశిస్తోంది. గేట్లకు మరమ్మతులు చేస్తే దీనిని నివారించొచ్ఛు.