రాష్ట్ర ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడిని ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకుంటున్నారని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా జగన్.. విహారయాత్రకు విదేశాలకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యలు, ధాన్యం కొనుగోలు జరిపిన చెల్లింపులు, అభివృద్ధి పనులకు నగదు చెల్లింపులను ఈసీ అడ్డుకుంటోందని ఆరోపించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించాలన్నా.. రైతులకు భరోసా కల్పించాలన్న ఈసీ మోకాలు అడ్డుపెడుతోందని మండిపడ్డారు. మోదీ సమీక్షలు చేసినప్పుడు.. చంద్రబాబు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలన్నింటిని గమనించారు కాబట్టే.. తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు వేచి ఉండి మరీ ఓట్లు వేశారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక వైకాపా మరింత దయనీయ పరిస్థితిలోకి వెళ్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు.