Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనల హోరు రోజురోజూకీ పెరుగుతోంది. అభిమానులు రోడ్డుపైకి వచ్చి వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొలేకే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. అధినేత విడుదలయ్యే వరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబుకు మద్దతుగా గుంటూరులో తెలుగు యువత రాజమహేంద్రవరం జైలుకు పోస్టు కార్డులు రాశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రిలే దీక్షలకు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుతూ.. గుడివాడ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. అవనిగడ్డలో మహిళలు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకిలో గుండ్లకమ్మ నదిలోకి దిగి వినూత్న నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి వద్ద మూసీ వాగులో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. జగన్‌కు పరిపాలన నేర్పించాలంటూ.. నెల్లూరులో గేదెలకు మెడలో ప్లకార్డులు తగిలించి వినూత్న నిరసన తెలిపారు.
కడప బెస్త సాధికారత కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఒంటిమిట్ట వరకు పాదయాత్ర చేశారు. కడప చిన్నచౌకులో గిరిజనులు ఆకులతో చేసిన తలపాగా ధరించి.. చేతుల్లో దీపాలు పెట్టుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ యువకుడు అరగుండు కొట్టించుకుని నిరసన తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లిలో రెడ్డి సామాజిక వర్గం చేపట్టిన రిలే దీక్షకు.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత, పలువురు టీడీపీ, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
కల్యాణదుర్గంలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు విడుదలవ్వాలని కోరుతూ.. వజ్రకరూరు మండలం గడేహోతూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. హిందూపురంలో నోటికి నల్లగుడ్డ కట్టుకుని చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. తర్వాత రోడ్డుపై వివిధ రకాల వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. హిందూపురంలో కురుబ సంఘం నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.
"వైసీపీ నాయకులు అధికారుల్లాగా ప్రవర్తించకుండా.. వైసీపీ గుండాల్లాగా ప్రవర్తించి మా కురుబ సంఘం నేతలను అరెస్టు చేయటం బాధకరం. జగన్మోహన్ రెడ్డి ఇలా చట్టాలను చుట్టాలుగా చేసుకుని.. అధికారులు ఇలా ప్రవర్తించటం చాలా బాధకరం" -కురుబ సంఘం మహిళ నేత
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ దీక్షకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో నల్ల గుడ్డలతో చేతులను బంధించుకుని, నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో దీక్షా శిబిరంలో జైలు ఏర్పాటు చేసి శ్రేణులు వినూత్న నిరసన తెలిపాయి. జగన్ రివర్స్ పాలనను నిరసిస్తూ ముమ్మిడివరం ప్రధాన రహదారిపై కార్యకర్తలు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఇసుకాసురుడు బోర్డు పెట్టి ఇసుకతో నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో శ్రేణులు ర్యాలీ చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలను పంచారు.
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రపల్లి సరస్సులో బోట్లపై కూర్చుని టీడీపీ జెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ.. విశాఖ రుషికొండ బీచ్ వద్ద ఉన్న శివాలయంలో మహిళలు సముద్ర జలాలతో అభిషేకం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.