గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బాలింతలు, గర్భిణిలు, పసికందులు.. మాతా, శిశు సంక్షేమ వార్డులో మంచాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచంపై ముగ్గురు తల్లులు, చిన్నారులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఆపరేషన్ నొప్పులు, మరో వైపు కింద పడిపోతామేమోనన్న భయంతో..ఆందోళన చెందుతూ గడుపుతున్నారు. ఆసుపత్రిలో మాతా, శిశు ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి 2014లో కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించింది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం మరో 15 కోట్లు జోడించింది. అమెరికాలోని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో..30 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మొత్తం 65 కోట్లుతో 600 పడకలు గల ఎమ్సీహెచ్ భవనం సెల్లార్, జీ ప్లస్ 5 నమూనాలో నిర్మించాలనుకున్నారు.
సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే విధంగా...2 నుంచి 5 అంతస్తులు జింకానా ప్రతినిధులు నిర్మించే విధంగా నిర్ణయించుకున్నారు. 2019లో ఆ పనులు ప్రారంభం కాగా..ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో గతేడాది మార్చిలో గుత్తేదారు అర్థాంతరంగా పనుల్ని ఆపేశారు. సుమారు 15 నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు.
ఆసుపత్రిలో మంచాలు సరిపోక మాతా, శిశువులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. పక్క వార్డుల నుంచి మంచాలు తెచ్చినా..సరిపోవడం లేదు. ఒక్కో మంచం మీద ముగ్గురు చొప్పున బాలింతలు, గర్భిణిలు ఉంటున్నారు. భవన నిర్మాణ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. ప్రభుత్వం స్పందించి మాతా, శిశు సంరక్షణ భవనం నిర్మాణ పనులు పునరుద్ధరిస్తే..తల్లీబిడ్డల కష్టాలు తీరుతాయి.
ఇదీ చదవండి: