తెదేపా జట్టు
సార్వత్రిక సమరం మెుదలైంది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులు ఖరారు కావడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది. తెదేపా తరఫున ఎన్నికల్లో ఎనిమిది సార్లు పోటీచేసి ఆరుసార్లు గెలుపొందిన సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్.. సత్తెనపల్లి నుంచి మరోసారి బరిలోకి దిగారు.పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర డబుల్ హ్యాట్రిక్‌పై కన్నేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నుంచి నాలుగుసార్లు పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు. ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలవలేరన్న సెంటిమెంట్‌ను పుల్లారావు అధిగమించారు. ఇప్పుడు మరోసారి కదనరంగంలోకి దూకారు. మరో సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు గురజాల నుంచి ఐదుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలుపొందారు.
సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేమూరు నుంచి మూడుసార్లు పోటీచేసి వరుసగా రెండుసార్లు విజయం సాధించి మూడోసారి ఓటమి పాలయ్యారు. అనంతరం నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా తెనాలి నియోజకవర్గానికి మారారు. 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేతిలో ఓడి.. 2014లో గెలిచారు. ఇప్పుడు మరోసారి సమరంలో పోటీ పడనున్నారు.
వినుకొండ నుంచి జీవీఎస్ ఆంజనేయులు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆశతో ఉన్నారు. తాడికొండ నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రత్తిపాడు నుంచి తెదేపా తరఫున బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ మంగళగిరి నుంచి తొలిసారి పోటీలో ఉన్నారు.
వైకాపా జట్టు
వైకాపా తరఫున పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థుల్లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, అంబటి రాంబాబు, మేకతోటి సుచరిత, మేరుగ నాగర్జున సీనియర్ నేతలు. మిగిలిన వారందరూ...గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు. తొలిసారి చేస్తున్న అభ్యర్థులు. చిలకలూరిపేట నుంచి విడుదల రజని, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పశ్చిమ నుంచి చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నుంచి నంబూరు శంకర్రావు, గురజాల నుంచి కాసు మహేశ్ రెడ్డి తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వేమూరి నుంచి వరుసగా రెండుసార్లు ఓటమిపాలైన మేరుగ నాగార్జున మూడోసారి బరిలో ఉన్నారు. సీనియర్ నేత అంబటి రాంబాబు రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు పోటీ చేసి రెండు సార్లు ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైకాపా తరఫున పోటీచేసి ఓడిపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత రెండుసార్లు గెలుపొంది 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. మరోసారి సమరానికి సిద్ధమయ్యారు. 2014లో వైకాపా తరఫున పోటీచేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ పోటీలో ఉన్నారు.
మాచర్ల నుంచి ఒకసారి కాంగ్రెస్ తరఫున, రెండుసార్లు వైకాపా తరఫున బరిలో దిగిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. నాలుగోసారి బరిలో ఉన్నారు. నరసరావుపేట, గుంటూరు తూర్పు, బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గెలుపొందిన వారే రెండోసారి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున పెదకూరపాడు నుంచి పోటీచేసి ఓడిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు ఈసారి సొంత నియోజకవర్గం వినుకొండ నుంచి పోటీ పడుతున్నారు.