నరసరావుపేటలో రేపటి లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ నరసరావుపేటకు వెళ్లనున్నారు. అయితే లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. కొవిడ్ దృష్ట్యా లోకేశ్ పర్యటనకు అనుమతి ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. అనూష హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ చేశామని చెప్పారు. పాత కేసులతో ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేయొద్దని కోరారు. ఇదిలావుంటే పర్యటనకు అనుమతి నిరాకరించటంపై తెదేపా నేతలు ఫైర్ అవుతున్నారు. లోకేశ్ పర్యటనను అడ్డుకోవటం హీరోయిజం కాదనే విషయం గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ గుర్తించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. చేతనైతే అనూషని క్రూరంగా చంపిన విష్ణువర్థన్ రెడ్డిపై హీరోయిజం చూపించాలన్నారు. నేరస్థుడు బెయిల్పై బయట తిరుగుతుంటే అనూష కుటుంబానికి న్యాయం చేశామని విశాల్ గున్నీ చెప్పటం సిగ్గుచేటని మండిపడ్డారు.
గత నెల 24న హత్య.. ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లా నరసరావుపేటలో గతనెల 24వ తేదీన జరిగిన అనూష హత్య సంచలనం సృష్టించింది. కృష్ణవేణి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నఅనూషను సహ విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డే హత్యే చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు దారితీసిన పరిణామాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. విష్ణువర్థన్ రెడ్డి అనూషను ప్రేమించాడని తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో అనూష మనోజ్ అనే మరో యువకునితో మాట్లాడటాన్ని విష్ణు జీర్ణించుకోలేకపోయాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీశాడు.
అదేరోజున నరసరావుపేట నుంచి అనూషను పాలపాడు సమీపంలోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఈ క్రమంలో విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహంతో అనూషను కింద పడేసి.. గొంతు నులిమి చంపేశాడని ఎస్పీ వివరించారు. అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు విషయం తెలియటంతో విష్ణువర్థన్ రెడ్డి స్వయంగా స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన చాలా దారుణమైందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరిపారని.. అన్ని ఆధారాలు కోర్టుకు నివేదిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరతామని.. ముద్దాయికి శిక్ష పడేలా చూస్తామని వివరించారు.
ఇదీ చదవండి
TOLLYWOOD DRUGS CASE: మనీలాండరింగ్ కేసులో ముగిసిన రానా విచారణ