తెదేపాపై కక్షతోనే వైకాపా ప్రభుత్వం ఇసుక నిలిపేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక సమస్యతో భవన నిర్మాణ కార్మికులు, పేదలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్మాణ రంగ కార్మికులతో పవన్ భేటీ అయ్యారు. లక్షల మంది ఆకలితో అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గతంలో మాదిరిగానే ఇసుక సులువుగా లభ్యం కావాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కన్నీరు తుడిచేందుకు సిద్ధంగా ఉన్నామని... విశాఖలో ఉద్యమం చేస్తానని చెప్పగానే ఇసుకపై ప్రభుత్వం కదిలిందని జనసేనాని అన్నారు.
అరాచకాలు పెరిగాయి
నెల్లూరులో వైకాపా నేతల అరాచకాలు పెరిగిపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారులు, జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడవకూడదన్న ఆయన... వైకాపా పతనానికి ఇసుకే నాంది అని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు చింతమనేని ఎక్కడున్నారో భవిష్యత్లో కోటంరెడ్డికీ అదే పరిస్థితి వస్తుందని పవన్ ఆరోపించారు. దాడులు చేసినవారు తప్పించుకోలేరన్న పవన్.. కాలమే వారిని శిక్షిస్తుందని చెప్పారు. సొంత చిన్నాన్న హత్య కేసును తేల్చని జగన్... ప్రజలకు ఎలా భరోసా ఇస్తారని అన్నారు. వైకాపాది అప్రజాస్వామిక పాలనని జనసేనాని మండిపడ్డారు. ఇసుకపై ఉద్యమానికి పిలుపు ఇవ్వగానే ప్రభుత్వం దిగివచ్చి కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ఎక్కడైనా ఇసుక తవ్వుకోవచ్చని ఇప్పుడు చెబుతున్నారన్న ఆయన... ఈ మాత్రం దానికి 4 నెలల పాటు ఎందుకు నిషేధించారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: