Pawan Kalyan Meets Chandrababu: తెలుగుదేశం - జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం ఈనెల 9నిర్వహించనున్నారు. ఆ దిశగా ఏకభిప్రాయం సాధించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఓ కరపత్రాన్ని తీసుకురావాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై ఇరునేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఎంతో ధృఢంగా నిలబడ్డారని.. వరుస అక్రమ కేసులని సమర్థంగా ఎదుర్కొంటున్నారని చంద్రబాబుతో పవన్ అన్నట్లు తెలిసింది. జైలుకు వచ్చి మద్దతు ప్రకటిచింనందుకు చంద్రబాబు పవన్‌కు ధన్యావాదాలు తెలిపినట్లు సమాచారం.
'త్వరలోనే పవన్ ఆశయ బలం, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వం రాబోతుంది'
ఉమ్మడి ఎజెండాపై చర్చ: దాదాపు రెండున్నర గంటలపాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు.. రాబోయే రోజుల్లోనూ తరచూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 9న నిర్వహించే సంయుక్త కార్యాచరణ కమిటీ (TDP Janasena Joint Action Committee) సమావేశంలో ఉమ్మడి ఎజెండాపై చర్చించి జనంలోకి ఐక్యంగా ఎలా వెళ్లబోయేదీ నిర్ణయించనున్నారు.
మేనిఫెస్టోపై దృష్టి: సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో ఇప్పటికే 6 ముఖ్యాంశాలను తెలుగుదేశం ప్రాథమిక మేనిఫెస్టోలో ప్రకటించింది. జనసేన సైతం ఇప్పటంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో షణ్ముఖ వ్యూహం పేరుతో 6 అంశాల్ని ప్రకటించింది. వీటితో పాటు మరికొన్నింటిని జత చేసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రభివృద్ధిపై దృష్టి: షణ్ముఖ వ్యూహంలోని అంశాలను పవన్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపకల్పనను సూచించినట్లు సమాచారం. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
ఉద్యోగ కల్పన దిశగా ఇరుపార్టీలు : బీపీఎల్ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ఉచిత ఇసుక పంపిణీ, 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమలు నడుపుకునేలా 10లక్షల రూపాయల చొప్పున సాయం అందించి.. తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం.
సకాలంలో ఉపాధి అవకాశాలు: వ్యవసాయం - బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సాహించాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రతిపాదించారు. మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేసి.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు.
గతంలోకంటే మెరుగైన మేనిఫెస్టో : సీపీఎస్ రద్దు చేసి గత ఫించన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించినట్లుగా తెలుస్తోంది. జనసేన తెలుగుదేశం మీనీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున.. వాటికి అదనంగా మరికొన్ని జోడించి తుది మేనిఫెస్టోను ఐక్యంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
TDP Janasena Meeting : ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనలోపు ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏకాభిప్రాయ అంశాలతో ఉమ్మడి కరపత్రాన్ని తెలుగుదేశం - జనసేన విడుదల చేయనున్నాయి. వైసీపీ సర్కార్‌ను ఎందుకు గద్దె దించాలో వివరిస్తూ.. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఎజెండాతో 2 పార్టీలు కార్యక్రమాలు చేపట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 పార్టీల జనరల్ బాడీ సమావేశాలు కూడా కలిపి నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ఆ అంశమూ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.