భవిష్యత్తులో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునఃశ్చరణ తరగతులను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించారు. వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాలు, విజయవాడ నగర పరిధిలోని క్రియాశీలక సభ్యులు ఈ తరగతుల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒక తల్లి, బిడ్డలకు కూడా విభేదాలు ఉంటాయన్నారు. అలాంటిది మనం విభిన్నమైన ప్రాంతాలు, కులాల మధ్య నుంచి ఒక చోటుకు వచ్చి ఒకేలా ఆలోచించాలంటే కష్టసాధ్యమైందని చెప్పారు. తమ భాష, యాసను గౌరవించడం లేదనే తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు. ఒకరి భాష, యాసను మరొకరు గౌరవించాలని సూచించారు. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయ వాదం రాదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ తెదేపాకు, అక్కడ టీఆర్‌ఎస్‌కు ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవని చెప్పారు. కుల, మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలని ఆకాంక్షించారు. జరుగుతున్న విధ్వంసాన్ని సరిచేస్తూ అభివృద్ధి చేయాలన్నారు. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని అన్నారు. ఇద్దరు ఎంపీల నుంచి ఇక్కడి వరకు భాజపా పోరాటం చేసిందని తెలిపారు. జనసేన కూడా అంతేనని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉందని..తమ పార్టీలో మహిళలను చైతన్యవంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పవన్ వ్యాఖ్యనించారు.
"రాబోయే తరాల కోసమే సరికొత్త పార్టీ స్థాపించా. కులాలను విడగొట్టడం కాదు.. కలిపే ఆలోచన చేయాలి. మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి. జనసేన వీరవనితలే మాకు భారతమాతలు. అవినీతి పెద్ద సమస్య కాదన్నట్లు ప్రజలు చూస్తున్నారు. దోపిడీ చేసే ప్రభుత్వాన్ని నిలదీయండి. మద్యం రద్దు అన్నారు.. కానీ ఏరులై పారిస్తున్నారు. రాజకీయ క్రీడలకు రాష్ట్రాన్ని బలి చేయకండి. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుంది.. జనసేన కూడా అంతే. మా పార్టీ సిద్దాంతాలు పనిచేయవని కొందరంటున్నారు. ఈ స్థాయికి రావడానికి భాజపాకు 20 ఏళ్లు పట్టింది. నాకు ఆశలు లేవు.. అశయాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉంది. మా పార్టీలో మహిళలను చైతన్యవంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం." -పవన్, జనసేన అధినేత
ఇవీ చదవండి
Telangana CM KCR: 'ఇక్కడ సర్కారు కూలిస్తే.. అక్కడ వారిని గద్దె దింపుతాం'