రాష్ట్ర పోలీసులకు కొత్త జాగిలాలు అందుబాటులోకి వచ్చాయి. 8 నెలల పాటు శిక్షణ తీసుకున్న పోలీసు జాగిలాలకు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. జర్మన్ షెపర్డ్, ఇంగ్లిష్ కోకర్ స్పానియల్, డాబర్ మాన్, లాబ్రెడార్, గోల్డెన్ రిట్రీవర్, బెల్జియం మెలినాయిస్ రకాలకు చెందిన 30 శునకాలు.. విధి నిర్వహణకు సిద్ధమయ్యాయి.
అద్భుత ప్రదర్శన
శునకాలకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో తర్ఫీదు కల్పించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన జాగిలాలకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ బహుమతులు ప్రదానం చేశారు. డీజీపీకి.. ఓ జాగిలం పుష్పగుచ్ఛం ఇచ్చి అందరినీ అబ్బురపరిచింది. పెరేడ్లో చురుకుగా పాల్గొన్న జాగిలాలు.. ప్రతిభ చూపాయి. వాసన పసిగట్టడంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించాయి. ల్యాండ్ మైన్స్ ఆచూకీని కనిపెట్టాయి.
విధులు ఇలా...
ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణా గుర్తించటంలో ఈ జాగిలాలు ప్రత్యేక శిక్షణ పొందాయి. ప్రస్తుతం శిక్షణ పొందిన 30 జాగిలాల్లో 8 జాగిలాలను తిరుమల శ్రీవారి దేవస్థానం భద్రతా విభాగానికి ఇవ్వనున్నారు. 21 జాగిలాలను అన్ని జిల్లాలకు పంపనున్నారు. రాష్ట్ర నిఘా విభాగం ప్రధాన కేంద్రానికి ఒక జాగిలాన్ని ఇవ్వనున్నారు.
8 నెలల పాటు శిక్షణ
ఎన్నో కేసుల్లో నిందితులకు సంబంధించిన సాక్ష్యాలను పోలీసు జాగిలాలు గుర్తించాయి. ఈ కారణంతోనే.. శునకాలకు అధికారులు దాదాపు 8 నెలల పాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండు నెలలు ప్రేమ, ఆప్యాయత, గార్డింగ్ విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత జాగిలాల లక్షణాలను బట్టి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. తర్ఫీదు అనంతరం.. అవసరాలకు అనుగుణంగా భద్రతకు కేటాయిస్తారు.