Bariatric Surgery : అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు ఊరట కల్పించారు. బేరియాట్రిక్ సర్జరీతో సుమారు 70కేజీల బరువును తగ్గించారు. ప్రభుత్వాసుపత్రిలో ఈ తరహా చికిత్స చేయడం తెలంగాణలోనే మొదటిసారని వైద్యులు తెలిపారు. రెండు నెలల క్రితం ఆపరేషన్ చేయగా.. ప్రస్తుతం ఆ యువకుడి బరువు 170 కేజీలకు చేరింది. దాదాపు 70 కేజీల వరకు తగ్గుదల కన్పించిందని, మరో 80 నుంచి 90 కేజీలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
అసలేమిటి యువకుడి కథ.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు చెందిన మహేందర్ సింగ్ అనే యువకుడు చిన్నతనం నుంచే ఊబకాయంతో అల్లాడుతున్నారు. వయసుతో పాటు అతని బరువూ పెరుగుతూ వచ్చింది. దీంతో నడవడం కూడా చాలా కష్టమైపోయింది. అయితే కుమారుడి అవస్థ చూడలేక ఆ తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిలో సంప్రదించారు. యువకుడిని పరీక్ష చేసిన డాక్టర్లు.. సర్జరీ చేయాలని.. అందుకోసం సుమారు 12 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆపరేషన్ కోసం అంత డబ్బు సమకూర్చలేని తల్లిదండ్రులు చివరికి ఉస్మానియా వైద్యులను కలిశారు.
దాదాపు 15 మంది డాక్టర్లు ఓ గ్రూప్‌గా ఏర్పడి యువకుడికి బేరియాట్రిక్ సర్జరీ చేయాలని డిసైడ్ అయ్యారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతో పాటు, ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా ఉండేందుకు ఆహారం స్వీకరించే చిన్నపేగును కూడా కొంత మేర తగ్గించారు. రెండు నెలల క్రితం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వచ్చారు. తినే పరిమాణం చాలా వరకూ తగ్గడంతో ఆ యువకుడి శరీర బరువు కూడా తగ్గుతూ వచ్చింది.
సహజంగా బేరియాట్రిక్ సర్జరీలు ప్రభుత్వాసుపత్రుల్లో చేయడం చాలా అరుదు. అధిక బరువుతో మునీందర్ మోకాళ్లపై భారం పడటం, డయాబెటిస్, హై బీపీ, ఇతర శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతున్నందున ఉస్మానియా వైద్యులు మానవీయ కోణంలో స్పందించి ఆ యువకుడికి నూతన జీవితాన్ని అందించారు. సర్జరీ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురైనట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహేందర్ సింగ్ దాదాపు 240 కేజీల బరువు ఉండటం వల్ల సర్జరీ సమయంలో టేబుల్‌పై పడుకోబెట్టడం కష్టంగా మారిందని.. శరీరానికి రెండు వైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి అతి కష్టం మీద పూర్తి చేశామన్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. వైద్యులను అభినందించారు.
రాష్ట్రంలోనే తొలిసారి: పదిహేను మందితో కూడిన వైద్య బృందం బేరియాట్రిక్ శస్త్ర చికిత్స చేసి దాదాపు 70కిలోల బరువు తగ్గించినట్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. ఊబకాయంతో బాధపడుతున్న మనిందర్ సింగ్‌కు(23)అరుదైన చికిత్స చేసినట్లు తెలిపారు. 220 కేజీలు ఉన్న మనిందర్సింగ్కు ఆపరేషన్ చేసి 70 కేజీల బరువు తగ్గించినట్లు వెల్లడించారు. మనిందర్సింగ్కు ఫుడ్‌తో పాటు జెనిటిక్ సమస్య ఉందని.. చిన్నతనం నుంచే ఊబకాయంతో బాధపడుతున్న మహేందర్ సింగ్‌కు బీపి, షుగర్ వచ్చిందని తెలిపారు.
సర్జికల్ గ్యాస్ట్రో ఎంటమాలజీ, ఎండో క్రైనాలజీ, అనస్తీషియా విభాగాలకు చెందిన 15మంది వైద్యుల బృందం.. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. ఆహారం స్వీకరించే చిన్న పేగును కూడా కొంత మేర తగ్గించినట్లు తెలిపారు. బేరియాట్రిక్ సర్జరీలో డైట్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. అనష్తీసియా వైద్యులు కూడా చాలా ఇబ్బంది పడ్డారని వెల్లడించారు. మునిందర్తో అనస్తీషియా వైద్యులు వాకింగ్, బ్రీతింగ్ వ్యాయామం చేయించారని.. ఆపరేషన్ టేబుల్ కూడా సరిపోలేదని.. ఇరువైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి సర్జరీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్స చేయడం తెలంగాణలోనే తొలిసారి అని.. సర్జరీ తరువాత కూడా విటమిన్, పోటిన్ డైట్ తో పాటు మజిల్ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: