ORGANIC FOOD IN MARRIAGE: పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరపురానిది. మరి అటువంటి దానిని చాలా మంది గ్రాండ్గా చేసుకుంటారు. వచ్చిన అతిథులను మర్యాదలతో ముంచెత్తుతారు. రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చిన వారిని మెప్పించాలన్న తాపత్రయంలో చాలా రకాల వంటలు చేయిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి కల్తీనే. తినే వాటి నుంచి తాగే వాటి వరకూ ప్రతి దాంట్లో ఎంతో కొంత కల్తీ జరుగుతూనే ఉంది. ఇక పెళ్లిల్లో అంటే అది చాలా మొత్తంలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఓ వ్యక్తి అది దృష్టిలో పెట్టుకుని ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
పెళ్లిలో కేవలం భోజనం మీద మాత్రమే కాకుండా వచ్చే అతిథుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాడు. అందుకే వినూత్నంగా కూతురు పెళ్లిలో సేంద్రీయ కూరగాయలతో విందు వడ్డించి కలకాలం గుర్తుండిపోయేలా చేశాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణమండపంలో రాజ నర్సింహా- ఉమామహేశ్వరిల కూతురి వివాహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి వచ్చే చుట్టాలకు ప్రకృతి సేద్యం ద్వారా పండిన పంటలను మాత్రమే ఆహారంగా వడ్డించాలని నిర్ణయించాకు.
అనుకున్నదే తడవుగా ఎటువంటి కెమికల్స్, పురుగు మందులు వాడకుండా గో ఆధారిత వస్తువులతో పండించిన దేశవాళీ బియ్యం రకాలు, పప్పులు, కాయగూరలు, వంటకు వినియోగించే దినుసులు.. ఇలా అన్ని రకాలు తెప్పించారు. ఆఖరికి నూనెల దగ్గర నుంచి మంచి నీళ్ల వరకు ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి దొరికిందే. వంటలకు వాడిన ముడి సరుకుల్లో తొంభై శాతం పాలమూరు రైతుల నుంచి తెప్పించడం ఇక్కడ విశేషం.
సహజంగా అన్నం వండటం కోసం రకారకాల బియ్యం ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ దేశవాళీ బియ్యంతో రకరకాల వంటకాలు సిద్ధం చేశారు. నవారా అనే చిరుధాన్యంతో ఉప్మా, బహురూపితో కేసరి, రత్నచోడితో కొత్తిమీర రైస్, మైసూర్ మల్లిగతో కరివేపాకు అన్నం, జీరా సాంబా తెల్లన్నం, కృష్ణ బియ్యంతో పరవన్నం, సిద్ధ సన్నాలతో బిర్యానీ, దిల్లీ బాసుమతితో పన్నీర్ బిర్యానీ, కుంకుమపువ్వు కలిపిన పూర్ణాలు, ఆకుకూరలతో ఇడ్లీ, ఆవు పాలతో గడ్డ పెరుగు వడ్డించారు.
అన్ని ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో వండిన పదార్థాలను.. వడ్డించడానికి అరటి ఆకుల్లో భోజనం వడ్డించారు. స్టీలు, మట్టి గ్లాసుల్లో నీళ్లు అందించారు. పర్యావరణహిత పళ్లాల్లో స్నాక్స్, స్వీట్స్ వడ్డించారు. శీతల పానీయాల జోలికి వెళ్లకుండా చల్లదనాన్ని అందించే చెరుకు రసాన్ని అందించారు.
హరిత విప్లవం రాకముందు ఇలాంటి పెళ్లిల్లు సహజంగా జరిగేవని, ఈ మధ్యే ఇలాంటివి 8 జరిపించామని ప్రకృతి వ్యవసాయ ఉద్యమ కారుడు విజయరాం చెప్పారు. ఎటువంటి హంగు, ఆర్భాటానికి తావు లేకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఇలాంటి వివాహాలను అందరూ ప్రోత్సహిస్తేనే పుడమి, గోవు, అన్నదాత సుభిక్షంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి..