Online Kidney Fraud: తండ్రి ఖాతాలోని డబ్బు అవసరాలకు వాడుకున్న ఓ అమ్మాయి.. కిడ్నీ అమ్మి ఆ డబ్బు ఇవ్వాలనుకుని చివరకు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి యామిని హైదరాబాద్‌లో నర్సింగ్ చేస్తోంది. అవసరాల కోసం ఆమెకు తన తండ్రి ఏటీఎం కార్డు ఇచ్చారు. దాంతో అందులో నుంచి 2 లక్షల రూపాయల వరకూ వాడుకుంది. ఆ డబ్బును రికవరీ చేయడం కోసం కిడ్నీ అమ్మాలని ఆన్‌లైన్‌లో కనిపించిన నంబర్‌ను సంప్రదించింది. అనంతరం ఆమె అవసరాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు.. రూ.3 కోట్లు ఇస్తామంటూ ఎరవేశారు. పన్నుల కింద దఫదఫాలుగా రూ.16 లక్షలు గుంజారు. కొంత కాలానికి మోసపోయానని గుర్తించిన యామిని తన తండ్రితో కలిసి.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా అనవసరమైన లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపారు.
"ఆన్‌లైన్‌లో ఓ వెబ్సైట్ చూశాను.. కిడ్నీ అమ్మితే నగదు వస్తుందని ఇతరుల ద్వారా విన్నాను.. వెబ్సైట్ వారికి మెసేజ్ చేయగా.. నిజమేనని నాకు చెప్పారు. ముందుగా సగం నగదు.. కిడ్నీ ఇచ్చిన తర్వాత 50 శాతం నగదు ఇస్తామని తెలిపారు. నిజమే అని నమ్మాను. అన్లైన్లో ఒక ఖాతా తెరిచి అందులో రూ.3కోట్ల నగదు ఉన్నట్లు చూపించారు. ఆ నగదు నా ఖాతాలో జమ చేయటానికి ఖర్చులకు డబ్బులు కావాలని అడిగారు. వారికి విడతల వారిగా రూ.16 లక్షలు చెల్లించాను." -యామిని, ఇంటర్ విద్యార్థిని
"ఆన్‌లైన్‌లో క్లాసులు వినాలంటే నా ఫోన్ ఇచ్చాను. అందులో నా ఖాతా ఉంది. ఒకసారి డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లాను. అప్పుడు ఖాతాలో నగదు లేదు. ఏమయ్యిందని మా పాపని అడగగా.. జరిగిన విషయం చెప్పింది."-రాజమోహన్‌రావు, యామిని తండ్రి
"అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దు.. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోడానికి పోలీసు శాఖ రూపొందించిన 'సైబర్ కవచ్' యాప్‌ని వినియోగించుకోవాలి." -ఆరిఫ్ హఫీజ్, గుంటూరు ఎస్పీ
ఇవీ చదవండి: