High Court: తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలని.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, కోరె నందు కుమార్ అలియాస్ నందు, డీపీఎస్‌కేవీఎన్ సింహయాజిలను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. అయితే రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. కొనుగోలుకు యత్నించారనే ఆరోపణలపై సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.
రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. నిందితులు తమ నివాస చిరునామాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అందజేయాలని సూచించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డిని సంప్రదించడం గానీ, సాక్షులను ప్రభావితం చేయడానికిగానీ వారు ప్రయత్నించరాదని షరతు విధించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసిన ధర్మాసనం.. సైబరాబాద్ పోలీసుల వాదనలతో ఏకీభవిస్తూ రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.
ఇవీ చూడండి: