గుంటూరు జిల్లా నాలి వైకుంఠపురానికి చెందిన తాపీ మేస్త్రీ దండమూడి శ్రీనివాస్‌కు... ఏడాది క్రితం ఓ ప్రమాదంలో చెయ్యి విరిగింది. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లోనూ ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదైంది. ఆ తర్వాత ఏమైందో.. శ్రీనివాస్ కథ అడ్డం తిరిగింది. చేయి విరిగిన శ్రీనివాస్... చికిత్స కోసం ఈ మధ్య... తెనాలి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తామన్న సిబ్బంది... కౌంటర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్కడుకు వెళ్లి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఇస్తే ఒకటికి రెండుసార్లు పరిశీలించి... శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడని సిబ్బంది.. ఆయనకే చెప్పారు. తానే శ్రీనివాస్‌నని.. బతికే ఉన్నానని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మరణించినట్టు రికార్డుల్లో ఉన్నందున బతికి ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. తాను బతికే ఉన్నట్టు సర్టిఫికెట్ ఇవ్వాలని శ్రీనివాస్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే... కాలయాపన చేశారే తప్ప పని పూర్తి కాలేదు. తెలిసిన వారి సూచన మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి తన దుస్థితి వివరించారు. చివరికి అక్కడి అధికారులు ఇచ్చిన లేఖతో శ్రీనివాస్‌కు ఉచితంగానే వైద్యం చేశారు.
కొన్ని రోజుల తర్వాత మరో సమస్య శ్రీనివాస్‌ను వెంటాడింది. చికిత్స చేసుకున్న చేయి పని చేయడం లేదని గుర్తించాడు శ్రీనివాస్. చేయిని మామూలు స్థితికి తీసుకురావాలంటే 5 లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చేయించుకుంటే పైసా ఖర్చు ఉండదని తెలిసినా... ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాడు శ్రీనివాస్. ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో శ్రీనివాస్ చనిపోయినట్టుగానే ఉన్నందున ఆరోగ్యశ్రీ వర్తించని సిబ్బంది చెబుతున్నారు.
కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనికావట్లేదు. విధిలేని పరిస్థితుల్లో మరోసారి సీఎం కార్యాలయానికి చేరుకున్నాడు శ్రీనివాస్. అధికారుల నిర్లక్ష్యం బతికున్న వ్యక్తిని చంపేసిందని.. తన పేరిట ఉన్న రికార్డులు మార్చి... కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి