No Funds To Urdu Computer Training Centers: ఉర్దూ అభ్యర్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల నిర్వహణ సరిగా సాగడం లేదు. కరోనా అనంతరం నిధులు లేకపోవడంతో శిక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలపై ప్రత్యేక కథనం..
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఉర్దూ కంప్యూటర్స్ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల నిర్వహణకు గత 14 నెలల నుంచి నిధులు అందట్లేదు. ఉర్దూ భాషలో ప్రావీణ్యంతో ప్రపంచస్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా గత ప్రభుత్వం హయాంలో శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాటిని కొన్నాళ్లు కొనసాగించింది. కొన్ని కేంద్రాల్ని కొత్తగా ఏర్పాటు చేసింది. కరోనాతో గత రెండేళ్లుగా ఈ కేంద్రాలు సరిగ్గా నడవడం లేదు. కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత కేంద్రాల్ని పునఃప్రారంభించినా నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ పరిధిలో నరసరావుపేట, పిడుగురాళ్ల, తెనాలి, పర్చూరు, చీరాలలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలతో పాటు గ్రంథాలయాలు ఉన్నాయి. మంగళగిరి, చిలకలూరిపేటలో కేవలం కేవలం శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి, మేడికొండూరులో గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉన్నాయి. 11 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఇన్స్ట్రక్టర్, లైబ్రేరియన్, అటెండర్ పోస్టులు ఉన్నాయి.
భవనాలకు అద్దెతో పాటు విద్యుత్తు బిల్లులు, దినపత్రికలు, పుస్తకాలు, తాగునీరు వంటి కనీస వసతులకు నిధులు రావాల్సి ఉంటుంది. ఒక్కో కేంద్రానికి నెలకు 10వేల నుంచి 20 వేల రూపాయల వరకు మంజూరు చేయాల్సి ఉంది. 2021 నవంబర్ తర్వాత ఉర్దూ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల నిర్వహణకు నిధులు మంజూరు చేయక.. వాటి నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో ఫండమెంటల్ ఆప్ కంప్యూటర్స్, ఎం.ఎస్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎం.ఎస్ విండోస్, ఎం.ఎస్ వర్డ్, ఎం.ఎస్ ఎక్సెల్, ఎం.ఎస్ పవర్ పాయింట్, హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్, పేజ్ మేకర్, ఫొటో షాప్, సీ-లాంగ్వేజ్ అంశాల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు.
నిధులు కొరతతో కంప్యూటర్ సేవలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని వాపోయారు. శిక్షణా కేంద్రాల్లో కరోనా సమయం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉర్దూ అభ్యర్థులు ఆసక్తిగా నేర్చుకుంటున్న కంప్యూటర్ విద్య, గ్రంథాలయాలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఔత్సాహికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: