No Distribution of Tidco Houses: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా.. టిడ్కో ఇళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి.. లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. తెలుగుదేశం హయాంలో 60 నుంచి 90 శాతానికిపైగా పనులు పూర్తైన వాటినీ కూడా లబ్ధిదారులకు అందజేయలేకపోతోంది.
గృహ నిర్మాణాల కోసం లబ్ధిదారుల పేరుపై టిడ్కో రుణం తీసుకుని నిర్దేశిత గడువులోగా ఇళ్లు అప్పగించకపోవడంతో వారి ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయి. వాయిదాలు చెల్లించాలని ఆయాబ్యాంకులు.. లబ్దిదారులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇళ్లు అప్పగించిన తర్వాతే వాయిదాలు కడతామని లబ్ధిదారులు చెప్పడంతో ఆ డబ్బు చెల్లించాలని బ్యాంకర్లు టిడ్కోను కోరుతున్నారు. తాజాగా ఓ బ్యాంక్ కోటీ 50లక్షలు చెల్లించాలని టిడ్కోను కోరింది.
తమ బ్యాంకు ఖాతాలు ఎన్పీఎలుగా మారే ప్రమాదం ఉండటంపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. తమకు భవిష్యత్తులో బ్యాంకు రుణాలు రాకపోవచ్చని వారు కలవరం చెందుతున్నారు. ఇప్పటికే మారటోరియం గడువు ముగిసిన 5వేల మంది ఖాతాలు ఎన్పీఎలుగా మారినట్లు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3లక్షల 13వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిలో 52వేలు రద్దు చేసింది. మిగిలిన 2 లక్షల 62వేల ఇళ్లలో మొదటివిడతలో లక్షన్నర, రెండోవిడతలో మిగతావి పూర్తి చేస్తామని ఏడాదిన్నరక్రితం ప్రకటించింది.
మొదటివిడతలో ఇస్తామన్న లక్షన్నర ఇళ్లలో చాలావరకూ తెలుగుదేశం హయాంలోనే 60నుంచి 90 శాతం మేర పూర్తనవే. అందులో ఇప్పటివరకు 75 వేల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించారు. మిగతావి డిసెంబరు నాటికి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 365 చదరపు అడుగు విస్తీర్ణంలో ఉన్న ఇళ్లపై 3లక్షల 15వేలు, 430 చదరపు అడుగు విస్తీర్ణంలో ఉన్న ఇళ్లపై 3లక్షల 65 వేల చొప్పున టిడ్కో రుణం తీసుకుంది. రెండేళ్ల మారిటోరియంలోగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలనేది ఒప్పందం.
Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు
ప్రస్తుతం మారటోరియం గడువు ముగిసి బ్యాంకు ఖాతాలు ఎన్పీఎలుగా మారాయని, డబ్బు చెల్లించాలని టిడ్కో అధికారులను బ్యాంకర్లు కోరుతున్నారు. ఎన్పీఎలుగా మారిన లబ్ధిదారుల జాబితాపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓ బ్యాంకు ఇచ్చిన జాబితాలో సగానికిపైగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించామని టిడ్కో అధికారులు చెప్పినట్లు తెలిసింది. కానీ తలుపులు, విద్యుత్తు మీటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇళ్లలోకి లబ్ధిదారులు వెళ్లలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే తమకు ఇబ్బందని, ఎన్పీఎమొత్తాన్ని టిడ్కోనే చెల్లించాలని పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఎవరికి ఇళ్లు అప్పగించారు, ఇంకా ఎంతమందికి ఇవ్వలేదన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని టిడ్కో నిర్ణయించింది. ఇందుకోసం టిడ్కో, పురపాలక కమిషనర్, మెప్మా, బ్యాంకు అధికారులతో సంయుక్త తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
తనిఖీల తర్వాతే ఎన్పీఎ మొత్తాన్ని చెల్లించాలని టిడ్కో నిర్ణయించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ప్రాధాన్యంగా తీసుకోవడంలేదని గుర్తించిన కొన్ని బ్యాంకులు.. రుణాల మంజూరులో పలు జాగ్రతలు తీసుకున్నాయి. తొలుత రెండు విడతల మొత్తాన్ని అందించి.. మిగతాది నిర్మాణం పూర్తయినా తర్వాత చెల్లిస్తామని మెలిక పెడుతున్నాయి.
జగన్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేంటి? కట్టిన ఇళ్లు ఎన్ని?