గుంటూరు నగరపాలక సంస్థలో ఆయా విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు, అధికారులు నగరపాలక ఆదాయానికి ఉద్దేశపూర్వకంగా గండికొట్టి, వ్యక్తిగత లబ్ధి చూసుకున్నారని విజిలెన్స్, ఏసీబీతో సహా శాఖాపరమైన అనేక విచారణలు చేయగా.. అవేం చర్యలకు నోచుకోలేదు. ఉన్నత స్థాయి యంత్రాంగం మెతకవైఖరిని అవలంభించటం, వారిపై ఒత్తిళ్లు తీసుకురావటం వంటి కారణాలతో ఆయా విచారణలు కనీసం పరిశీలనకు రాకుండానే నీరుగారిపోయాయి.
తప్పు చేసిన ఉద్యోగులపై ఎప్పుడైతే చర్యలకు సిద్ధ పడతారో అప్పుడే అవినీతి, అక్రమాలకు పాల్పడటానికి భయం కలుగుతుంది. గడిచిన 11 ఏళ్ల నుంచి నగరపాలక సంస్థకు కౌన్సిల్ లేకపోవటంతో కొందరు ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆటగా మారింది. విధి నిర్వహణలో ఎప్పుడు తప్పు చేసినా ఉద్యోగి పదవీ విరమణ చేసేలోపు చర్యలు తీసుకునే అధికారం పాలకులకు ఉంది. త్వరలో ఏర్పడబోయే నూతన కౌన్సిల్ నాటి అక్రమాలకు సంబంధించిన విచారణ నివేదికలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
మచ్చుకు కొన్ని..
2013 నుంచి 2015వ సంవత్సరం మధ్య కొన్ని అపార్టుమెంట్లకు రెవెన్యూ విభాగం నిర్ధారించిన పన్నులను కాదని అప్పటి ఉన్నతాధికారి ఒకరు పెద్దఎత్తున పన్నులు తగ్గించి వ్యక్తిగత లబ్ధి చూసుకున్నారు. దీనికి సంబంధించి అప్పటి కమిషనర్‌తో పాటు పలువురు రెవెన్యూ అధికారులు దానికి బాధ్యులని గుర్తించారు. ఇప్పటికీ ఆని వేదికపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
- 2011 నుంచి 2016 వరకు నగరంలో మహాత్మాగాంధీ అంతర్వలయ రహదారి, కొరిటిపాడు జేకేసీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. వీటిల్లో స్థలాలు కోల్పోయిన వారికి నగరపాలక ఆ మొత్తానికి పరిహారంగా టీడీఆర్ బాండ్లు జారీచేసింది. వాటి జారీలో పెద్దమొత్తంలో గోల్‌మాల్ జరిగిందని ఏసీబీ విచారణలో నిగ్గు తేలింది. ఒకే టీడీఆర్ బాండ్ నంబరుతో పలు భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. సుమారు రూ.50-60 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు సంబంధం లేని వ్యక్తులకు జారీచేసి నగరపాలక ప్రణాళికా విభాగానికి చెందిన కొందరు సిబ్బంది, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, సూపరవైజర్లు అధికారులు లాభపడ్డారని 21మందిపై చర్యలకు సిఫార్సు చేశారు. శాఖలో లాబీయింగ్ చేయించుకుని చర్యలు లేకుండా నిలుపుదల చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి.
- 2012-2016 మధ్య ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలవకుండా వర్క్ ఆర్డర్లు ఇచ్చారని, ఆపనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని అయినా బిల్లులు చెల్లింపులు చేశారని విజిలెన్స్ నివేదికలు నిగ్గుతేల్చాయి. అదేవిధంగా రిజర్వాయర్ల వద్ద నీటి శుద్ధికి వినియోగించే ఆలం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. భారీగా ధరలు చెల్లించారని, స్కాడా సిస్టమ్‌కు రూ.కోట్లు వెచ్చించినా దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదని పలువురు ఉద్యోగులపై చర్యలకు సిఫార్సు చేశారు. అవేం అమలు కాలేదు.
- 2015 నుంచి 2017 వరకు నిర్వహించిన వార్షిక ఆడిట్‌లో నగరంలో కొన్ని సినిమా థియేటర్లను సాధారణ భవనాలుగా, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను క్లినిక్‌లుగా చూపి పన్నులు విధించారని అభ్యంతరాలు వెలుగుచూశాయి. గత కమిషనర్ శ్రీకేష్ లత్కర్ అరండల్‌పేటలో కొన్ని భవనాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆయన పరిశీలనలోనూ భారీ వ్యత్యాసాలు గుర్తించారు. ఆయన బదిలీ తర్వాత ఆ నివేదిక మరుగున పడింది.
- సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో అకౌంట్సు విభాగంలో చెక్కుల జారీ విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అందుకు బాధ్యులపై చర్యలు చేపట్టలేదు.
- నగరంలో కొన్ని వాణిజ్య సముదాయాల్లో లీజు గడువు ముగిసినా రెండోకంటికి తెలియకుండా లీజులు పొడిగించారు. దీన్ని పట్టించుకునేవారే లేరు.
ఇదీ చదవండి: