New Issues Raising in Misuse of AP CM Petitions Case: ముఖ్యమంత్రి పేషీ పిటిషన్ల దుర్వినియోగం(Misuse of AP CM Petitions) వ్యవహారంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న సీఎంఓలోని ఓఎస్డీ నారాయణ స్వామిని జీఏడీకి బదిలీ చేసిన ప్రభుత్వం.. అక్కడి నుంచి కూడా అతన్ని తహశీల్దారుగా పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సచివాలయ సర్వీసులో భర్తీ అయిన నారాయణ స్వామి.. సీఎం పేషీలో జరిగిన అక్రమాల్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇందులో పెద్దల పేర్లు బయటకు రాకుండా సీఎంవో నుంచి ఆయన్ను హుటాహుటిన సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆ వెంటనే ఆయన దరఖాస్తుపై తహశీల్దారుగా ఫీల్డ్ డ్యూటీకి వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చినట్టు సమాచారం.
అయితే సచివాలయ సర్వీసు నుంచి కనీసం రెండేళ్లపాటు రెవెన్యూ ఇన్స్పెక్టరుగా అనుభవం లేకుండా నేరుగా తహశీల్దారు విధుల్లో చేరేందుకు వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి కార్యాలయ పిటిషన్ల దుర్వినియోగం వ్యవహారంలో కొందరు పెద్దల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఓఎస్డీ నారాయణ స్వామిని బయటకు పంపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎంవోతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్ల స్థాయిలోని 5గురు వ్యక్తుల్ని సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అరెస్టు చేసింది. కేవలం 66 సీఎంపీలు మాత్రమే దుర్వినియోగం అయినట్టు గుర్తించామని సీఐడీ చెబుతోంది. అయితే ఇంకా పెద్ద సంఖ్యలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారుల పాస్వర్డ్లు ఉపయోగించి సీఎంపీలు జారీ అయినట్టు సమాచారం. ఈ అంశంలో సీఎం కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఐఎఎస్ అధికారి మామ హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు గుప్పుమన్నా.. ప్రభుత్వం అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.
ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఐఎఎస్ అధికారులు రేవు ముత్యాలరాజు, ధనుంజయ్ రెడ్డిలకు సంబంధించి ఇ-ఆఫీస్ లాగిన్లను డాంగిల్ పరికరాలు వినియోగించి సీఎంవోలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇ-ఆఫీస్ లాగిన్ ద్వారా సీఎంపీలు పంపించినట్టుగా సీఐడీ దర్యాప్తులో తేల్చింది. అయితే ఈ వ్యవహారంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల కంటే పై అధికారి ప్రోద్భలం లేకుండా ఈ స్థాయిలో సీఎంపీలు దుర్వినియోగం కావన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎంపీల దుర్వినియోగంలో ఓఎస్డీ నారాయణ స్వామి పాత్ర కూడా కీలకమని లోతైన విచారణ జరిగితే కొందరి పెద్దల పేర్లు బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో అతన్ని అత్యవసరంగా సాధారణ పరిపాలన శాఖకు అటు నుంచి తహశీల్దార్గా క్షేత్రస్థాయి పోస్టుకు పంపేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దుర్వినియోగం అయిన ఇ-ఆఫీస్ లాగిన్ డాంగిల్స్ను కూడా మార్చేశారు.