Negligence on Godavari Penna Interlinking Project: అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంలో.. పెన్నా- గోదావరి ప్రాజెక్టు ఎంతో కీలకమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఏకంగా 9 లక్షల 61 వేల 231 ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరించవచ్చు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈప్రాజెక్టుకు 6 వేల 20.15 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. గోదావరి వరద సమయంలో నీటిని.. ప్రకాశం బ్యారేజీకి తీసుకువచ్చి.. చివర నుంచి ఎత్తిపోసేందుకు వీలుగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానది నుంచి నీటిని తోడి సాగర్ కుడికాలువ 80వ కిలోమీటరు వద్ద పోస్తారు. ఐదుచోట్ల పంపుహౌస్‌లు ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోస్తారు. ఏటా 73 టీఎంసీల నీటిని సాగర్ కాలువలకు తరలిస్తారు. 56.35 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ. ఐదు పంపుహౌస్‌ల ద్వారా 10.25 కిలోమీటర్ల దూరం ఎత్తిపోసి నీటిని కాలువలోకి కలుపుతారు.
Rivers Linking: మాటిచ్చి మడమ తిప్పారు.. నిలిచిన వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియ
తెలుగుదేశం హయాంలోనే టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేశారు. మొత్తం పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి మెగా, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీలకు అప్పగించారు. ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు మార్చారు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభమై పంపుహౌస్‌కు సంబంధించిన సామగ్రి వచ్చింది.
ఆపై కొంత పని చేశారు. భూసేకరణకు నిధులివ్వటంలో మాత్రం ప్రభుత్వం జాప్యం జరిగింది. ఫలితంగా పరిహారం చెల్లించిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భూసేకరణ జరగక గుత్తేదారులు పనులు పూర్తిగా నిలిపివేశారు. పల్నాడు ప్రాంతానికి ఎంతో అవసరమైన ప్రాజెక్టు పనులు ఆగిపోవడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రాజెక్టులో కాలువ, పంపుహౌస్‌ల నిర్మాణానికి 3 వేల 445.76 ఎకరాల భూమి అవసరం. ఆరు మండలాల్లో సేకరించే ఈ భూమికి 955.61కోట్లు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నిధులివ్వకపోవడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. తొలిదశ నిర్మాణాలకు 999.151 ఎకరాలు చాలని, ముందు ఇందుకోసం 312 కోట్లు విడుదల చేయాలని జలవనరులశాఖ ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదు. ఆ మేరకు నిధులిచ్చి భూమి సేకరించి ఉంటే పంపుహౌస్‌ల నిర్మాణమూ, విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణ పనులు సాగేవి. ఆ నిధులూ ఇవ్వక ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉంది.
రెండు గుత్తేదారు కంపెనీల పంపుహౌస్‌ల నిర్మాణానికి యంత్రపరికరాల సమకూర్చుకోగా.. వాటికి ప్రభుత్వం 1,010.87 కోట్ల బిల్లులు ఇచ్చేసింది. ఏపీ జెన్‌కోకు మూడున్నర కోట్లు చెల్లించాల్సి ఉంది. భూములిచ్చిన రైతులకు సొమ్ములు మాత్రం ఇవ్వలేదు. భూసేకరణ పూర్తి చేయకపోవడంతో ఆ యంత్రపరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. పనులూ ఆగిపోయాయి. రైతుల భూములను నిషిద్ధ జాబితాలో పెట్టడంతో.. చాలా ఇబ్బందిపడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అవసరమైన నిధులిస్తే 2024 డిసెంబరు 31 నాటికి విడతల వారీగా భూసేకరణ పూర్తి చేస్తామని.. 2025 జూన్ 30కి ప్రాజెక్టును ట్రయల్‌రన్‌కు సిద్ధం చేస్తామని జలవనరులశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వ నుంచి భూసేకరణ నిధులపై ఇప్పటికీ స్పష్టత లేక ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది.
"ప్రాజెక్టు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. మరోవైపు మాకు సరైన నష్టపరిహారం ఇస్తే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తోంది". - రైతు