Nara Lokesh Padayatra in Mangalagiri from Today: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర గత 184 రోజులుగా.. యువత సందడి.. పసుపు సైన్యం హడావుడి.. మహిళల సంప్రదాయ స్వాగతం.. గజమాలలతో ఆత్మీయ ఆహ్వానం.. భారీ స్వాగత తోరణాల నడుమ అట్టహాసంగా కొనసాగుతోంది. పాదయాత్రలో యువనేత లోకేశ్.. వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగ యువత, రైతులు, మహిళలతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. చేయబోయే కార్యక్రమాలు, ప్రవేశపెట్టబోయే పథకాల గురించి వెల్లడిస్తూ ముందుకు సాగుతున్నారు.
Lokesh Mangalagiri Padayatra Schedule.. యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ప్రారంభం కానుందని.. ఆ పార్టీ నేతలు తెలిపారు. మంగళవారం పాదయాత్రలో నారా లోకేశ్ ఏయే కార్యక్రమాల్లో పాల్గొనున్నారో షెడ్యూల్‌ను విడుదల చేశారు. ''ముందుగా నారా లోకేశ్ సమక్షంలో మంగళవారం ఉదయం నిడమర్రు వద్ద వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల నుంచి సుమారు 1500 మంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. మధ్యాహ్నం నిడమర్రు నుంచి పాదయాత్ర ప్రారంభమై.. మంగళగిరి మీదుగా ఎర్రబాలెంకు చేరుకుంటుంది. ఎర్రబాలెంలోని డాన్ బాస్కో స్కూల్ మైదానంలో రాత్రి బస చేయనున్నారు. ఈనెల 16న 'హలో లోకేశ్' పేరుతో యువతతో ప్రత్యేక సమావేశం కానున్నారు. 17న డాన్ బాస్కో స్కూల్ నుంచి తాడేపల్లి మీదుగా ఉండవల్లి చేరుకుంటుంది. 18న లోకేశ్ మంగళగిరి న్యాయస్థానానికి హాజరుకానున్నారు. 19వ తేదీ ఉదయం ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా పాదయాత్ర కొనసాగి.. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది'' అని పార్టీ వర్గాలు తెలిపాయి.
TDP Leaders who Arranged Huge Flexis.. ఈ నేపథ్యంలో మంగళగిరిలో నారా లోకేశ్ పర్యటించనున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర సాగే మార్గంలో భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. నిడమర్రు నుంచి మంగళగిరి వరకు యువగళం జెండాలతో అలంకరించారు. లోకేశ్ పాదయాత్రతో నియోజకవర్గంలో భారీ మార్పులు వస్తాయని.. పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సైకో పోయి సైకిల్ వచ్చేందుకు లోకేశ్ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Tension Atmosphere in Mangalagiri.. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోకేశ్ పాదాయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ ఫ్లెక్సీ పనులను నగరపాలక సంస్థ అధికారులు మరోసారి అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకూ ఫ్లెక్సీలు పెట్టుకోమని అనుమతిచ్చిన అధికారులు..ఎల్ఈడీ తెరలను అడ్డుకునేందుకు యత్నించారు. ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తే.. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. నగర పాలక సంస్థ అధికారులకు రక్షణ కల్పించి.. ఎల్ఈడీ తెరలను రోడ్డుపై పెట్టకుండా అడ్డుకున్నారు. దీంతో డీఎస్పీ రాంబాబుతో చర్చలు జరిపిన టీడీపీ నేతలు.. డీఎస్పీ అనుమతితో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.