Nara Lokesh Emotional Speech at TDP Meeting in Mangalagiri : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నారా లోకేశ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆవేదనకు గురై మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ లోకేశ్ చేసిన కీలకోపన్యాసం ఆద్యంతం గద్గద స్వరంతో సాగింది. చంద్రబాబు కూర్చునే కుర్చీని ఖాళీగా పెట్టి సమావేశం నిర్వహించారు. ఏ తప్పు చేయకున్నా ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ వేదికపై లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు.
Nara Bhuvaneshwari Nijam Gelavali Programe Starts From October 25th in Chandragiri : ఈ నెల 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదే రోజు చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి వెళ్తారని లోకేశ్ తెలిపారు. 25 నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 'నిజం గెలవాలి (Nijam Gelavali)' పేరిట చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. సేవా కార్యక్రమాలు తప్ప ఏం తెలియని తన తల్లిని.. అవమానించేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదనతో అన్నారు.
దొంగ ఓట్ల చేర్పులపై పోరాటం ఆపొద్దు : తెలుగుదేశం-జనసేనల పొత్తు ఉండకూడదని నాలుగున్నరేళ్లుగా జగన్ చేసిన ప్రయత్నం నెరవేరలేదని లోకేశ్ అన్నారు. ఇరు పార్టీల మధ్య విబేధాలు సృష్టించేందుకు పేటీఎం బ్యాచ్ పనిచేస్తోందన్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. దొంగ ఓట్ల చేర్పులపై పోరాటం ఆపొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు.
వర్షాలు లేక పంటలు ఎండి పోతుంటే వాటిని కాపాడాల్సిన జగన్.. దోపిడీలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇసుక తమ్ముడికి, కల్తీ మద్యం మరో తమ్ముడికి కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఇంటింటికీ వెళ్లి జగన్ దోపిడీని వివరిద్దామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇరు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. "బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం" ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే నవంబర్ 1న ప్రారంభిస్తానని ప్రకటించారు.
పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు : స్కిల్ డెవలెప్మెంట్పై నిన్న ప్రధాని చేసిన ప్రకటనతోనైనా జగన్ సిగ్గుపడి తన ముక్కు నేలకు రాయాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ పుంజుకోలేదనే తప్పుడు ఆలోచన చేసిన జగన్ బూమ్రాంగ్ అయ్యరని ఆక్షేపించారు. సరైన సమయంలో తెలుగుదేశానికి జనసేన తోడైందన్నారు. పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపుతున్నామన్నారు.
Lokesh Stuck in Traffic At Mangalagiri : తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి పోలీసు అడ్డంకులు సృష్టించారు. విజయవాడలో VIP మూమెంట్ ఉందంటూ దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి వద్ద ట్రాఫిక్‌ను హైవే నుంచి సర్వీస్ రోడ్ లోకి మళ్లించారు. ఎన్టీఆర్ భవన్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. లోకేశ్‌తో పాటు ముఖ్య నేతలు చాలాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయ్యాక ట్రాఫిక్ని పోలీసులు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదికి వదిలారు.