Nara Bhuvaneshwari Fires on AP Government: టీడీపీ మద్దతుదారులు, ప్రజలు తనను కలవకూడదని చెప్పడానికి.. ప్రభుత్వానికి హక్కు ఎక్కడిదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఆయనకు మద్దతుగా పార్టీశ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజమండ్రిలో ఉన్న తనకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి పార్టీ శ్రేణులు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వారని భువనేశ్వరి పేర్కోన్నారు. బాధలో ఉన్న తనను కలిస్తే టీడీపీ శ్రేణులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు అందించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రిలో ఉన్న భువనేశ్వరిని కలిసేందుకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. అరెస్టులు, గృహనిర్బంధాలతో కట్టడి చేశారు. అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. భువనేశ్వరిని కలిసేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు నర్సీపట్నంలోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా పోలీసులు ఆయన ఎక్కడికి వెళ్లకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.
కోనసీమ జిల్లాలో బీసీ విభాగం నేతల హౌస్ అరెస్ట్: కోనసీమ జిల్లాలోని తెలుగుదేశం బీసీ విభాగానికి చెందిన నాయకులు రాజమహేంద్రవరం వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర రాజమహేంద్రవరం వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి టీడీపీ బీసీ నేతలు వెళ్లకుండా.. వారిని హౌస్ అరెస్టు చేసి అడ్డుకున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పలువురు బీసీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
చంద్రబాబు అరోగ్యంపై ప్రత్యేక పూజలు: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని.. ఆయన జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
జిల్లాలోని కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతర ఉత్సవాల్లో.. అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని.. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గోత్రా నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో జాతర ప్రాంగాణాన్ని మార్మోగించారు.