Janasena leader Nadendla Manohar: పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో వైకాపా ప్రభుత్వం పెద్ద మోసం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ అని చెప్పే ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో ఎన్ని ఇళ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా సమీక్షలు, కోట్ల రూపాయల ఖర్చుతో ప్రచారం తప్ప.. క్షేత్రస్థాయిలో పురోగతి లేదన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో కేవలం 8 శాతం ఇళ్లను మాత్రమే పూర్తి చేశారని... పీఎంఏవై పథకంలోని ఇళ్లు కూడా కేవలం అయిదు మాత్రమే నిర్మించడం చూస్తుంటే వైకాపా పాలన ఎలా ఉందో అర్థం అవుతోందన్నారు. మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి.. దమ్ముంటే గృహ నిర్మాణ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
పేదలకు 31 లక్షల మందికి 2023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే పూర్తయిన 1.19 లక్షల టిడ్కో గృహాలకు లబ్ధిదారులకు ఇవ్వకుండా.. వారిని కూడా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. జగనన్న కాలనీల్లో ఇళ్లకు ఇసుక కూడా సజావుగా అందించటం లేదని విమర్శించారు.
ఇవీ చదవండి: