మున్సిపాలిటీల ఆదాయాన్ని స్థానికంగానే వ్యయం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. స్థానికంగా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. ఆ డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడదని స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు మెరుగైన సేవలందించటంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్వోపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. మున్సిపాలిటీ ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ వద్దన్నారు. మున్సిపాలిటీల ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? వంటి అన్ని విషయాలు తెలుసుకుని.... వాటి అభివృద్ధికి ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్వోపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు