పెండింగ్ జీతాలు విడుదల చేయాలంటూ.. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నగర పాలక సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు నాలుగు నెలల నుంచి రావాల్సిన జీతాలు ఇవ్వాలంటూ మంగళగిరిలో నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులు వీరికి మద్దకు పలుకుతూ.. నిరసనలో భాగమయ్యారు.
నగరపాలక సంస్థ కార్యాలయ గేట్లు మూసేసి.. అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యాలయంలోనికి వెళ్లిన కార్మికులను పోలీసులు బలవంతంగా బయటకు లాకొచ్చారు. కార్మికులు, సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ వ్యవహారంపై పలుసార్లు వినతిపత్రం అందించినా అధికారులు స్పందించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమపై బలవంతంగా దాడి చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు