నగర, పుర పోరుకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజున ప్రధాన పార్టీల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు నగరపాలక సంస్థతో సహా ఏడు పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా చివరి రోజునే అత్యధిక మంది నామినేషన్లు దాఖలు చేయటానికి రావటంతో పురపాలిక, వార్డు సచివాలయాలు ఆయా పార్టీ అభ్యర్థులతో కిటకిటలాడాయి. నామినేషన్ల ర్యాలీలతో పట్టణాలు హోరెత్తాయి.
గుంటూరు నగరపాలక పరిధిలో 15 సచివాలయాల పరిధిలో నామపత్రాలు స్వీకరించారు. 12 సచివాలయాల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగియటానికి రాత్రి 10 గంటల వరకు పట్టింది. నగరపాలకలో శుక్రవారం ఒక్క రోజే అత్యధికంగా 435 మంది నామినేషన్లు వేయటం గమనార్హం. ఇంతపెద్ద సంఖ్యలో రావటంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అయింది. తెనాలి, సత్తెనపల్లి, రేపల్లె, వినుకొండ, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, మాచర్లలో కలిపి శుక్రవారం ఒక్క రోజే 866 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరు నగరపాలకలో 435 రాగా... మాచర్లలో అత్యల్పంగా 60 దాఖలయ్యాయి. ఒకే అభ్యర్థి రెండు, మూడు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల ఘట్టం ముగియటంతో శనివారం వాటి పరిశీలన ప్రారంభం కానుంది. పరిశీలనలో అభ్యర్థులు సరైన పత్రాలు సమర్పించలేదని గుర్తిస్తే వాటిని తిరస్కరిస్తారు. అయితే దానిపై అభ్యర్థులు అప్పీల్ చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ రోజున ఏ పార్టీ తరపున ఏ పుర, నగరపాలికలో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎందరనేది ఖరారవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ప్రధాన పార్టీల అభ్యర్థులు బీ-ఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే భాజపా-జనసేనలు తమ అభ్యర్థులకు ఆ మేరకు పారాలు అందజేశాయి. శనివారం వైకాపా తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగియటంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
ఇదీ చదవండి : నామినేషన్ ఉపసంహరణకు రూ.5 లక్షలు