గుంటూరు జిల్లా వినుకొండలో పురపోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ 32 వార్డుల్లో 7 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. మరో 25 చోట్ల బరిలో ఉన్నారు. తెదేపా 21 చోట్ల, తెదేపా మద్దతుతో సీపీఐ అభ్యర్థులు నాలుగు చోట్ల పోటీ చేస్తుండగా.. 3 చోట్ల జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం సాధిస్తామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధీమాతో ఉన్నారు. బ్రహ్మనాయుడు దూకుడైన ప్రచార శైలితో వేడి పుట్టించారు.
కనీసం తెదేపా 5 సీట్లు గెలిస్తే.. తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. లేనిపక్షంలో రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం అమలుచేసిన ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. sవినుకొండ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తామని ఆయన చెప్పారు.
వైకాపా ఎత్తులకు దీటుగా మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత ఆంజనేయులు సైతం పావులు కదుపుతున్నారు. ఆంజనేయులు నామినేషన్ల ఉపసంహరణ దశలోనే క్యాంపు రాజకీయాలను నడిపించి కొంతమేరకు పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవాల బారినుంచి కాపాడుకున్నారు. నామినేషన్ల పర్వానికి రెండ్రోజుల ముందే అభ్యర్థులు, ప్రతిపాదకులను వేరే శిబిరానికి మార్చి బరిలో నిలబడేలా చూశారు. పెరిగిన నిత్యావసర ధరలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని.. ఇక ప్రజలే తమ నిర్ణయాన్ని వెల్లడించాలని ఆంజనేయులు కోరారు.
ప్రచారం ముగుస్తున్న దశలో అసలైన ఎన్నికల సమరానికి రెండు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇదీ చదవండి: రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేం: కేంద్రం