రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు గొడ్డలి పెట్టులా ఉన్నాయని ఎంపీ మోపీదేవి వెంకటరమణ అన్నారు. అమరావతిలో రాజధాని పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించామని అన్నారు. ఎన్నో ఆధారాలున్నా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టులు ఎలా చెబుతున్నాయని మోపిదేవి ప్రశ్నించారు. ఈ తీర్పు పై న్యాయస్థానం మరో సారి పరిశీలించాలని మోపిదేవి కోరారు. గుంటూరు జిల్లా రేపల్లె రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ పర్యటించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం.. సంప్రదింపులు జరిపేందుకే.. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ను తెదేపా ప్యాకేజీలకే పరిమితం చేసిందని.. సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడి నిధులు ఇచ్చేలా ఒప్పించారన్నారు. కమీషన్ల కోసం ఆశపడి పోలవరం లాంటి ఎన్నో ప్రాజెక్టులను తెదేపా ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందని మోపిదేవి ఆరోపించారు.
ఇదీ చదవండి: అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం