Minister Botsa Comments on Teacher Vacancies: ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులో ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు. మంజూరు పోస్టులను ఎక్కడా రద్దు చేయలేదు. ఈ ఏడాది మార్చి 20న శాసనమండలి సమావేశంలో మంత్రి బొత్స సమాధానం ఇది. తాజాగా ఆయనే.. మళ్లీ 8 వేల 366 పోస్టులు అవసరం, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటాం అంటూ శుక్రవారం శాసన సమావేశాల్లో శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై మంత్రి ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి.
మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు లక్షా 88 వేల 162 ఉంటే.. పనిచేస్తున్న వారు లక్షా 69 వేల 642 మంది. ఈ లెక్కన 18 వేల 520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి 8,366 పోస్టులే అవసరమన్నారు. మిగతా 10,154 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసేస్తుందా.. లేక తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు కారణంగా అవసరం లేకుండా పోయాయా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్క తేల్చారు.
మూడున్నరేళ్లైనా ఆ ఊసే లేదు.. ఒక్క పోస్టూ భర్తీ కాలేదు
చంద్రబాబు 7,900 పోస్టులకే డీఎస్సీ ఇచ్చారని.. తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ గుప్పించారు. వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఇంతవరకు మెగా డీఎస్సీ నిర్వహించలేదు. పోస్టుల హేతుబద్ధీకరణ, 3,4,5 తరగతుల విలీనం,1 నుంచి 9 తరగతుల్లో ఒకే మాధ్యమం, 9, 10తరగతుల్లో సెక్షన్‌కు 60 మంది విద్యార్థులను పెంచిన ప్రభుత్వం పోస్టులను భారీగా మిగుల్చుకుంది.
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 7 వేలకు పైగా మిగులుగా ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. 3,4,5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ వీటిని ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో కలిపేసింది. దీంతో ఎస్జీటీ పోస్టుల అవసరం లేకుండా పోయింది. పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ పాఠశాలల్లో 4,102 ఎస్జీటీలు అవసరం కాగా.. 9,912 మంది మిగులుగా ఉన్నారు.
సర్దుబాటు చేసిన తర్వాత ఇంకా 5 వేల187 మంది మిగలనున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఎస్జీటీల అవసరం ఉంది. భవిష్యత్తులో డీఎస్సీ నిర్వహించినా ఎస్జీటీ పోస్టులు ఉండకపోవచ్చు. అర్హత కలిగిన ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంతో మరోపక్క స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు తగ్గిపోయాయి. కొత్త నియామకాలు లేకపోగా ఉన్న పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది.
ఆదర్శ పాఠశాలల్లో 3 వేల 260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4 వేల764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు. అయిదు అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో 15, కొత్తగా 692 మండల విద్యాధికారుల పోస్టులను సృష్టించేందుకు 11 వందల45 ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ బోధనకు 17 వందల 52 స్కూల్ అసిస్టెంట్ల కోసం అంతే సంఖ్యలో ఎస్జీటీ పోస్టులను తొలగించింది. కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయుల పోస్టుల కోసం 76ఎస్జీటీ పోస్టులను రద్దు చేసింది.
Botsa Vs Telangana Minister: గరంగరం.. మంత్రి బొత్సను ఆడుకున్న తెలంగాణ మంత్రులు