గుంటూరు నగరపాలక సంస్థకు 11 సంవత్సరాల విరామం తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. మేయర్‌గా కావటి మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. ఉదయం 11గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. మొత్తం 57మంది కార్పొరేటర్లలో.. 44 మంది వైకాపా, 9 మంది తెదేపా, ఇద్దరు జనసేన, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ముందుగా నూతన కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. మేయర్ పదవికి వైకాపా నుంచి ఎన్నికైన కావటి శివనాగ మనోహర్ నాయుడు ఒక్కరి పేరు మాత్రమే వచ్చింది. దీంతో ఆయన మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం డిప్యూటి మేయర్ ఎన్నిక జరగ్గా వనమా బాలవజ్రం బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొత్త మేయర్, డిప్యూటి మేయర్లకు కలెక్టర్, కమిషనర్, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు. అనంతరం మేయర్, డిప్యూటి మేయర్లతో కమిషనర్ అనురాధ ప్రమాణ స్వీకారం చేయించారు. గుంటూరు నగర అభివృద్ధికి కార్పొరేటర్లు, అధికారులు అంతా కలిసి పనిచేస్తామని నూతన మేయర్ కావటి మనోహర్ నాయుడు చెప్పారు. తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నిక అనంతరం మేయర్, డిప్యూటి మేయర్లను తోటి సభ్యులు సన్మానించారు.
మేయర్ ఎన్నికకు.. నగర పార్టీ అధ్యక్షుడు గైర్హాజరు..!
గుంటూరు నగర మేయర్ ఎన్నికకు. వైకాపా నగర పార్టీ అధ్యక్షుడు, ఆరో డివిజన్ కార్పొరేటర్ పాదర్తి రమేష్ గాంధీ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మేయర్ పదవిని ఆశించిన రమేష్ గాంధీ భంగపడ్డారు. ప్రమాణస్వీకారానికి ముందు గుంటూరు కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన రమేశ్‌గాంధీ మేయర్‌గా మనోహర్ నాయుడు పేరును ప్రకటించగానే నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు. నగరపాలిక కార్యాలయంలో జరిగిన కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఆయన హాజరు కాలేదు. శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్లే రమేశ్ గాంధీ ఇంటికి వెళ్లిపోయారని అనుచరులు చెప్పుకొస్తున్నారు.
ఇదీ చూడండి.