Grama Sabhalu For Capital Master Plan : రాజధాని బృహత్ ప్రణాళిక మార్పు అభ్యంతరాలపై హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ అధికారులు.. మందడం, లింగాయపాలెంలో గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానికులు.. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించారు. బృహత్ ప్రణాళికలోని జోన్ల మార్పులను ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. రాజధాని పరిధిలో ఉన్న పేదలకు తొలుత భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ విడుదల చేసింది. 900 ఎకరాల్లో R-5 జోన్ ఏర్పాటును ప్రతిపాదించింది. తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని ప్రాంతాల్లో ఇది రానుంది. దీనికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు సీఆర్డీఏ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబరు 28 నుంచి నవంబరు 11 వరకు అభ్యంతర పత్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. ఈ అంశంపై రైతులు అటు అభ్యంతర పత్రాలు సమర్పిస్తూ.. ఇటు గ్రామ సభల ఏర్పాటుకు పట్టుబట్టారు. రైతులకు అనుకూలంగానే హైకోర్టు గ్రామసభల ఏర్పాటుకు ఆదేశాలివ్వడంతో ఇవాళ మందడం, లింగాయపాలెంలో సభలు నిర్వహించారు.
గత నెల 31నుంచి రాజధాని గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు రైతులు తమ అభ్యంతరాలపై వినతిపత్రాలు సమర్పిస్తూ వచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో .. మందడం, లింగాయపాలెం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇతర గ్రామాల రైతులు సీఆర్డీఏ కమిషనర్‌కు పెద్ద ఎత్తున అభ్యంతరాలను ఫిర్యాదుల రూపంలో ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలలోగా గ్రామ సభలు నిర్వహించి, వాటి వివరాలను తమకు సమర్పించాలని కోర్టు పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో మందడం, లింగాయపాలెం గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సభలు నిర్వహించారు. వీటిల్లో తమ వాణిని వినిపించిన రైతులు, రైతు కూలీలు ఏకగ్రీవంగా ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించారు.
రాజధానిలోని మిగిలిన గ్రామాల్లోనూ గ్రామ సభలు నిర్వహించాలని రైతులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మందడం, లింగాయపాలెంలో వలే మిగిలిన చోట్లా గ్రామసభలు పెట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. రైతుల వినతిని మన్నించిన ధర్మాసనం మిగిలిన 17 గ్రామాల్లోనూ 2 రోజుల్లో సభలు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీ చదవండి: