చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం రేపింది. గుంటూరు జిల్లా అమృతలూరు మండల ఇంటూరు గ్రామానికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మ భర్తతో జరిగిన చిన్న వివాదం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్క ఆత్మహత్యకు యత్నించడానికి బావే కారణమని భావించిన బాధితురాలి తమ్ముడు క్షణికావేశంలో బావను హత్య చేశాడు.
ఇంటూరు గ్రామానికి చెందిన అంకమ్మరావుకు, వట్టిచెరుకూరు మండలానికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. పొలం పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన భర్త, భార్యల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. గొడవ కారణంగా మనస్తాపానికి గురైన లక్ష్మీ తిరుపతమ్మ మందు తాగి ఆత్మహత్యకు యత్నంచింది. దీంతో ఆమె బంధువులు శనివారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.
అక్కను చూసేందుకు అక్కడకు వచ్చిన తమ్ముడు వెంకటేష్ కోపోద్రిక్తుడై బావతో వివాదానికి దిగాడు. వివాదం పెరగడం క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న కత్తితో బావపై దాడికి దిగాడు. ఛాతి, తల భాగాలపై కత్తితో పొడిచిన కారణంగా బావ అంకమ్మరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి..