గుంటూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం వైఎస్వివేకా హత్యపై వైకాపా నాయకులు డ్రామాలాడారని ముఖ్యమంత్రిచంద్రబాబు మండిపడ్డారు. హత్యలో తనకూ ప్రమేయం ఉందన్నట్టు మాట్లాడడాన్ని తప్పుబట్టారు. గుంటూరులో సార్వత్రిక ఎన్నికల తెదేపా ప్రచార ర్యాలీకి హాజరైన సీఎం... 31 కేసులు తనపై పెట్టుకుని ఏమీ ఎరగనట్టు జగన్ నటిస్తున్నారని విమర్శించారు. చిన్న కోడి కత్తితో పెద్ద డ్రామా ఆడారని విమర్శించారు. దేశంలో కరుడుగట్టిన నేరస్తుడు జగన్ అయితే.. ఆయనకు కాపలాదారు మోదీ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు భయపడే విజయమ్మను ఓడించారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు. చీకటి రాజకీయాలు, ముసుగు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన సీఎం... జగన్, మోదీ, కేసీఆర్ ధైర్యముంటే కలిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ అడుగుతున్నారనీ... జగన్‌కు అవకాశం ఇస్తే మనం మరణశాసనం రాసుకున్నట్లే అని మరోసారి స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు అమరావతి అభివృద్ధి భయం: సీఎం
అమరావతి అభివృద్ధి చెందుతోందని కేసీఆర్‌కు భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అమరావతి ప్రపంచ 5 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా ఉండబోతోందని చెప్పారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయి ఉందని చెప్పారు. ఆ డబ్బులు అడిగితే.. తిరిగి మనమే ఇవ్వాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మోదీ, కేసీఆర్, జగన్ బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందుతుందేమో అని మోదీ భయపడుతున్నారని అన్నారు.